హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ఆర్థిక మంత్రిగా కూడా రోశయ్య తనదైన ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రోశయ్యకు ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. తాను 2007లో తొలిసారిగా శాసనసభకు వెళ్లిన సందర్భాలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆర్యవైశ్య సమాజం కోసం నిర్మించనున్న ఆత్మగౌరవ భవన్ భవిష్యత్‌లో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.
Telangana
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కారణాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి క్రీయాశీలకంగా మారాలని కొండా సురేఖకు ఈ సందర్భంగా ఆమె సూచించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొండా సురేఖ సభకు గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జి నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ హాజరవుతారా లేదా అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలే తెలంగాణ మంత్రి మండలి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయ్యారు. కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సిఫార్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్‌పై అసెంబ్లీకి చేరుకున్న పాయల్ శంకర్.. రాష్ట్రంలో రైతులకు పంట బీమా అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కేంద్ర ఫసల్ బీమా పథకంలో ఖరీఫ్ పంటలకు రైతులు రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యానవన పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించే విధానం ఉందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టాల సమయంలో రైతులకు ఈ పథకం భరోసాగా నిలుస్తుందని అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని పాయల్ శంకర్ ఆరోపించారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుతుందనే కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
పనీర్ పేరుతో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ ఉత్పత్తుల తయారీపై టీజీ సేఫ్ నిషేధం విధించింది. తయారీతో పాటు ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపైనా ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
సెప్టెంబర్ 10వ తేదీ నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(a) కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగనుంది. ఆర్టిఫిషియల్ పనీర్ విక్రయాలు, సరఫరాపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో వ్యాపార వర్గాల్లోనూ ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న గందరగోళం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్పీకర్ పోడియంను ముట్టడించి నిరసన తెలిపినందుకు కేటీఆర్, హరీశ్‌రావు సహా 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంతో.. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభ కొనసాగుతోంది.
ఇక ఇవాళ సభలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే అంశంపై సభ్యులు చర్చించనున్నారు. దేశవ్యాప్త జనగణనలో బీసీ కులాల కోసం ప్రత్యేక ఆప్షన్ చేర్చాలన్న డిమాండ్‌పై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో మార్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కూడా చర్చకు అవకాశం ఉంది.
మరోవైపు అసెంబ్లీ వెలుపల జరిగిన ఉద్రిక్తతలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణంపైనా విచారణ జరగనుంది. ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నిరసనలు కొనసాగిస్తుండటంతో.. అసెంబ్లీ వెలుపల కూడా రాజకీయ వేడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని వివరించారు.
పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యం కావడంపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆవేదనను కూడా జేఏసీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన రేవంత్‌రెడ్డి.. తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన ఉంటానని హామీ ఇచ్చినట్లు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు కే.గౌతమ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమణ్‌రెడ్డి తెలిపారు. ఒక్కో సమస్యను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్లు వెల్లడించారు.
ఆరు డీఏలపై త్వరలోనే ప్రకటన చేస్తామని.. పీఆర్సీ కమిటీ నివేదిక కూడా వెంటనే తనకు అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చినట్లు ట్రెసా నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించడంపై ట్రెసా రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేసింది. సీఎంను కలిసిన వారిలో ట్రెసా గౌరవాధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ఉన్నారు.
శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు.
భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. సభలో చర్చకు వచ్చిన ప్రతి అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది. మైక్ ఎవరిదైనా.. మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, 22ఏ భూముల వివాదం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో సభ రాజకీయ రణరంగంగా మారింది. మరోవైపు పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు, 2027 జనగణనలో బీసీల లెక్కల చేర్పు వంటి కీలక అంశాలు ఎజెండాలో ఉన్నా.. రాజకీయ వివాదాలే ప్రధానంగా నిలిచాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో ప్రతిపక్షం లేకుండానే సభ కొనసాగింది. 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరింది. స్పీకర్‌పై వ్యాఖ్యలు, ఎర్రవల్లి ఘటన, శుద్ధి కార్యక్రమం వివాదం చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఘటనలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించింది.
అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు, దళితులను అవమానించే చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు వెనుక ఉండి నడిపించిన వారిపైనా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దళితులను అవమానించేలా ప్యూరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించడం తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. పలువురు మంత్రులు కూడా ఘటనను ఖండించారు.
ప్రముఖ రియల్టర్, హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పటాన్చెరులో 280 ఎకరాల్లో వెంచర్ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి.. స్థానిక నేతలు, పలువురి ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2018లో పటాన్చెరువు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల భూమిని డెవలప్మెంట్ కోసం తీసుకుని వెంచర్ చేపట్టారు. అయితే భూమికి సంబంధించిన వివాదాలు, కోర్టు లిటిగేషన్ల కారణంగా వెంచర్ అభివృద్ధి ఆలస్యమైనట్లు తెలుస్తోంది. వివాదాల పరిష్కారం కోసం భారీగా అప్పులు చేయడంతో పాటు.. భూ యజమానులతోనూ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. వెంచర్ ఆలస్యం కావడంతో ఆర్థిక భారం పెరిగి తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
రాంరెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను కందుకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాంరెడ్డి ఆత్మహత్యకు అసలు కారణాలు, ఆయనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తుల సౌకర్యార్థం అదనంగా ఆర్టీసీ బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే మహిళా భక్తుల సంఖ్య పెరిగిందని బీర్ల ఐలయ్య తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.