బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని విస్తరించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆర్థిక రంగాలతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపైనా నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరుగుతున్న వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మోదీ–అన్వర్ ఇబ్రహీం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికపై భారత్, మలేషియా మధ్య సహకారాన్ని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను ఇరువురు నేతలు చర్చించారు. బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో ఈ భేటీ ఇరు దేశాల సంబంధాలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.
International
ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు సుమారు 400 మంది అధికారులతో కూడిన ప్రతినిధి బృందం రానుంది. ఢిల్లీ చేరుకున్న అనంతరం సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భారత్–చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, ఆర్థిక సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిన్‌పింగ్ పర్యటనలో భాగంగా భారత్, చైనా మధ్య దౌత్యపరమైన చర్చలు జరగనున్నాయి.
బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు. ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని ఆయనకు బహూకరించారు. సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. పరస్పరం కరచాలనం చేసుకుని, ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీలో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు సమాచారం.
ప్రధాని మోదీ బహూకరించిన తిరుక్కురళ్ తమిళ సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్య, గౌరవం పొందిన గ్రంథాల్లో ఒకటి. దీనిని సుప్రసిద్ధ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించారు. ఇందులో నీతి, నైతికత, ప్రేమ, సంపద, పాలన, మానవ ప్రవర్తన వంటి అనేక అంశాలపై 1,330 పద్యాలు ఉన్నాయి. ఈ గ్రంథం అర్థవంతమైన, నైతిక జీవితాన్ని ఎలా గడపాలో తెలియజేసే మార్గదర్శిగా ప్రసిద్ధి చెందింది. ఇందులోని అంశాలు సార్వత్రికమైనవి కావడంతో, భాష, సంస్కృతి, దేశాల సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పటికే అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడిన ఈ గ్రంథం రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు అందించడం ద్వారా, విశ్వమానవ విలువలను చాటిచెప్పే భారతీయ సాహిత్య వారసత్వాన్ని నరేంద్ర మోదీ ఆయనకు పరిచయం చేసినట్టయింది.
పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి. పుతిన్ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది. రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం. పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది. బ్రిక్స్‌లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ కనిపించాయి. అయితే ఇది నిజమైన రోబో తిరుగుబాటు మాత్రం కాదు. డెమోక్రాటిజం, పోలిష్ రోబోటిక్స్ సంస్థ డెల్టా రోబోట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. “ఉద్యోగాలను కాపాడండి”, “నిబంధనలు తీసుకురావాల్సిన సమయం వచ్చింది” అంటూ ముందుగా రికార్డు చేసిన సందేశాలను రోబోలు ప్రసారం చేశాయి. కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ కారణంగా భవిష్యత్‌లో ఉద్యోగాలపై ఏర్పడుతున్న ఆందోళనను చర్చకు తీసుకురావడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో ఈ కార్యక్రమం డెల్టా రోబోట్స్ సంస్థకు ప్రచారంగా కూడా మారింది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగాల భద్రత, AI నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోబో మార్చ్ ప్రత్యేకంగా నిలిచింది.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేలా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త ప్రతిపాదన చేసింది. ఉద్యోగం పోయిన తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా అమెరికా నుంచి తిరిగి వెళ్లేందుకు ఇస్తున్న రెండు నెలల గడువును రద్దు చేసే దిశగా ప్రతిపాదన వచ్చింది. ఈ మార్పు H-1Bతో పాటు L-1, O-1, TN వంటి ఇతర వర్క్ వీసాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు ప్రతిపాదించినట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. విదేశీ ఉద్యోగులను త్వరగా భర్తీ చేసుకునే అవకాశం తగ్గితే.. కంపెనీలు అమెరికన్లను నియమించుకునే అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యోగం కోల్పోయిన వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, కుటుంబాన్ని తరలించడం, ఇల్లు-పిల్లల చదువులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం వారికి పెద్ద సవాలుగా మారనుంది.
అయితే ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు కాలేదు. తాజా ప్రతిపాదనపై 60 రోజుల పాటు ప్రజలు, కంపెనీల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత వచ్చిన సూచనలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ ఐటీ నిపుణులతో పాటు అమెరికాలో H-1Bపై ఆధారపడిన కుటుంబాలు, కంపెనీలపై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కీలక ప్రతిపాదన చేశారు. శాంతి చర్చలు సజావుగా సాగేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కో, ఆదివారం కైవ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రష్యా కూడా ఎయిర్‌స్ట్రైక్‌లు నిలిపివేయాలని కోరారు.
అమెరికా రాయబారుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, రష్యాను దృష్టిలో పెట్టుకుని కాదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు వాస్తవిక మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. మరోవైపు రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై వరుస వైమానిక దాడులు చేస్తుండగా, తాజా దాడుల తర్వాతే జెలెన్స్కీ కాల్పుల విరమణ ప్రతిపాదన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దక్షిణ అమెరికా ఖండంలోని బొలీవియాలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బొలీవియాలోని ఓ మిలిటరీ బేస్‌లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మిలిటరీ బేస్ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా అన్న దానిపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. అసలు పేలుడుకు కారణం ఏమిటనే దానిపై విచారణ ప్రారంభించారు. మిలిటరీ బేస్‌లో ఆయుధాలు లేదా ఇతర పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉంది. దార్చులా జిల్లాలోని అపి హిమల్ రూరల్ ప్రాంతం భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి కొంత మేరకు అడ్డంకిగా మారాయి. దీంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగితే దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. నది ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొండచరియల కారణంగా నదికి అడ్డంకి ఏర్పడటంతో నీరు నిలిచి, ఒక్కసారిగా అడ్డంకి తొలగితే దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల కారణంగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తాజాగా చౌలానీ నదికి ఏర్పడిన అడ్డంకితో స్థానికుల్లో మరోసారి ఆందోళన నెలకొంది.
నేపాల్‌లో వరదలు, కొండచరియల విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి–3A జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దాదాపు తొమ్మిది రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న వారిని తీవ్రంగా శ్రమించి రక్షించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, టన్నెల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల మధ్య సహాయక బృందాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగారు. టన్నెల్లో ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టన్నెల్లో చిక్కుకున్న వారి నుంచి శబ్దాలు వినిపించినట్లు సమాచారం అందడంతో.. రెస్క్యూ బృందాలు మరింత అప్రమత్తమయ్యాయి. మిగిలిన వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ.. బాధితులను రక్షించేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఇద్దరిని సజీవంగా రక్షించడం సహాయక చర్యల్లో కీలక పరిణామంగా మారింది.