అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు, నారాయణలను ఈ కేసులో దౌర్జన్యపూరితంగా నిందితులుగా చేర్చారని హైకోర్టు స్పష్టం చేసింది. నాటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని, దాని వెనుక కేవలం దురుద్దేశం మాత్రమే ఉందని కోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వాలు తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఒకవేళ ప్రతి నిర్ణయానికి ఇలాగే నేరాలను ఆపాదిస్తూ పోతే, అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అమరావతి భూములకు సంబంధించి నాటి ప్రభుత్వం చట్ట నిబంధనలను అనుసరించే జీవో 141ని తీసుకువచ్చిందని కోర్టు స్పష్టం చేసింది. ఈ జీవో వల్ల తాము నష్టపోయామంటూ అసలైన భూ యజమానులు గానీ, రైతులు గానీ ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని ఈ సందర్భంగా గుర్తుచేసింది. సీఆర్డీఏ పరిధిలో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చట్టపరమైన రక్షణ ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం అధికారులను లేదా ప్రజాప్రతినిధులను ఇలాంటి నిర్ణయాలపై ప్రాసిక్యూట్ చేయడాన్ని చట్టం నిషేధిస్తుందని స్పష్టం చేసింది. చంద్రబాబు, నారాయణలపై మోపిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పిన ఏపీ హైకోర్టు… వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ సదరు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తన తుది తీర్పులో ప్రకటించింది.
Politics
నదుల అనుసంధానం చేస్తే.. రాష్ట్రానికి కరవు ఉండదని అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆ తర్వాత సాగునీటి రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజనీరుగా కేఎల్ రావు అందించిన స్ఫూర్తిని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జలవనరులే అభివృద్ధికి మూలమని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఖర్చు చేసి..36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు.
నాడు ఉమ్మడి ఏపీలో తాము హైటెక్ సిటీ నిర్మిస్తుంటే దండగ అన్నారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఐటీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలిచిందని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలోని కొందరు రాజకీయం కోసం రైతుల్ని రెచ్చగొట్టి చివరకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆగస్టు 15 కల్లా సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు.
దేశంలో నదుల అనుసంధానం జరిగితే అద్భుతమైన అవకాశాలు ఉంటాయని, గోదావరి-కావేరి అనుసంధానాన్ని కేఎల్ రావు నాడే ప్రతిపాదించగా, వాజపేయి హయాంలో గంగా-కావేరి అనుసంధానం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోతున్న తరుణంలో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన వాటా లభిస్తోందని, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు.మంత్రి నారా లోకేష్ మిషన్ రాయలసీమ లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని ఆరోపించిన ఆయన.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ ప్రాజెక్టును అభివృద్ధి కోసం కాకుండా అవినీతికి వేదికగా మార్చిందని విమర్శించారు.జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలో చేసే ఖర్చుకు సమానంగా కూడా వైసీపీ ఐదేళ్లలో ఖర్చు చేయలేదని ఆరోపించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10.30 కి వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని విస్తరణ కోసం కొత్తగా భూములిచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40 వేల చొప్పున యాన్యుటీ చెల్లించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ నిర్ణయం రాజధాని నిర్మాణానికి భూములిచ్చే రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది. దీంతో పాటు, రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో అక్రమణల తొలగింపు, మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ కారణంగా ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇళ్లు కోల్పోయిన సదరు లబ్ధిదారులకు నెలకు 10 వేల చొప్పున అద్దె భత్యం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ల్యాండ్ పూలింగ్ రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయాలతో పాటు, రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలు, ఐటీ పాలసీ, పలు సంక్షేమ పథకాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పామర్రు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని చూసి ప్రతిపక్ష నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఆర్అండ్బీ రోడ్లు, డ్రైనేజీలు, ఎంఎస్ఎంఈ పార్క్‌తో పాటు పలు అభివృద్ధి పనులు పామర్రు నియోజకవర్గంలో జరిగాయని తెలిపారు. చెరువుల మట్టి తవ్వకాలపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు చేపట్టామని స్పష్టం చేశారు. గ్రామాల్లో స్మశానాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాల అభివృద్ధికి మట్టి వినియోగించామని వెల్లడించారు.తన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని మండిపడిన కుమార్ రాజా.. రాజకీయంగా విమర్శలు చేయాలంటే తనను లక్ష్యంగా చేసుకోవాలని, కుటుంబ వ్యవహారాల్లోకి రావొద్దని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను హెచ్చరించారు.
తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టై, వరసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆటోమేటిగ్గా పదవులు కోల్పోయేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులందరికీ వర్తించే బిల్లును గత ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దానిపై సమగ్ర పరిశీలన నిమిత్తం అపరాజితా సారంగీ నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించారు.
తమ అభ్యంతరాలను అధికారపక్షం సులభంగా బేఖాతరు చేస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి సభ్యులంతా జేపీసీని బహిష్కరించారు. కమిటీ ఈ నెల 17న భేటీ అయి నివేదికను ఆమోదించి, 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. దానిపై సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పదవుల్ని కోల్పోయే ప్రధాన నిబంధనను కమిటీ అలాగే ఉంచి, రాజకీయ ప్రతీకార చర్యల కోసం ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొన్ని సూచనల్ని నివేదికలో చేర్చవచ్చని తెలుస్తోంది. బెయిల్ పొందడానికి 30 రోజుల గడువు సరిపోతుందని, ఆ వ్యవధిలో కనీసం మూడుసార్లు ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడం లేదని జేపీసీ గట్టిగా సమర్థిస్తోంది. నేర స్వభావం ఆధారంగా ఆంక్షలు ఉండాలనే సిఫార్సును జేపీసీ చేయవచ్చని భావిస్తున్నారు.
తమిళనాడులో అన్నాడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు డాక్టర్ సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్ అధికార టీవీకే పార్టీలో చేరారు. వీరితో పాటు సుమారు 15 వేల మంది మద్దతుదారులు కూడా పార్టీ మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చెన్నై సమీపంలోని మామల్లపురంలో గల ఒక ప్రైవేట్ హోటల్లో ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. మంత్రి ఆధవ్ అర్జున కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అన్నాడీఎంకే నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితోనే తాము పార్టీ మారుతున్నట్లు మాజీ మంత్రులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సి. విజయభాస్కర్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు మరియు తర్వాత కూడా టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తాము పార్టీ అధిష్ఠానానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా డీఎంకేతో పొత్తుకు ప్రయత్నిస్తుండటంతో తాము పార్టీలో ఇమడలేకపోయామని తెలిపారు. ప్రజల్లో అపారమైన విశ్వాసం నింపిన విజయ్ నాయకత్వంలోని టీవీకేలో చేరడమే సముచితమైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన అతిపెద్ద చేరికల్లో ఇది ఒకటి. ఈ ఇద్దరు మాజీ మంత్రులతో పాటు మరో మాజీ మంత్రి ఎస్. వలర్మతి, ఎం.ఎస్.ఎం. ఆనందన్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, 208 మంది యూనియన్ కార్యదర్శులు కూడా టీవీకేలో చేరారు. కరూర్, పుదుక్కోట్టై జిల్లాల నుంచి సుమారు 200 బస్సులు, 600 కార్లలో భారీ సంఖ్యలో మద్దతుదారులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ చేరికలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో టీవీకే వంద శాతం విజయం సాధిస్తుందని విజయభాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన నరసాపురం పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేసిన ఆయన, వ్యక్తిగత విమర్శలకు తామూ సమాధానం చెప్పగలమన్నారు. అయితే అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రాధాన్యమని, నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని తమ నాయకత్వం సూచించిందన్నారు. వైసీపీ పాలనలో సామాన్యులు, వ్యాపారులు, వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అందుకే ప్రజలు మార్పును కోరుకున్నారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కర్నాటక రాష్ట్ర ప్రతినిధులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ఎస్ బోసేరాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బస్వన్న గౌడ్ కలిసి సీఎంను కలిసి కీలక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు.. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ఏర్పాటు ద్వారా ప్రాజెక్టు భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడనున్నట్లు ప్రతినిధులు సీఎంకు వివరించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక మధ్య జలవనరుల వినియోగం, సాగునీటి అభివృద్ధి, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై కూడా సమాలోచనలు జరిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పార్కులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.




Total views : 221094