పీఆర్ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఆనంద్.కె. దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా హీరో లోమేష్ పూడిపెద్ది, హీరోయిన్ జయశ్రీ, తో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్, విజ్క్షానిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ నివ్వగా, సక్సెస్ఫుల్ నిర్మాత బన్నీవాస్ కెమెరా స్వీచ్చాన్ చేశారు. ఇటీవల సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిన నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు, దర్శకుడు విజయ్ కనకమేడల, విఐ ఆనంద్‌లతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్డ్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని, టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, చందు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్.కె.
Film
టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి సమర్పణలో, శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వి. సాంబశివరావు, సి. వేణుగోపాల చారి వ్యవహరిస్తుండగా, TFDA అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల ప్రముఖ దర్శకుల చేతుల మీదుగా విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచార చిత్రాలు ట్రెండింగ్‌లో నిలవడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు (డల్లాస్) మాట్లాడుతూ, “ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేశాం. ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ గ్రామీణ నేపథ్యంలో ప్రారంభమయ్యే ప్రేమకథ. అనంతరం ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా మలుపులు తిరుగుతూ, గోవా నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని తెలిపారు.
అలాగే, తండ్రి పాత్రలో సుమన్ తన అనుభవంతో కథకు మరింత బలం చేకూర్చారని, ఆనంద్ భారతి ప్రేక్షకులు ఊహించని ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని చెప్పారు. తల్లి పాత్ర కూడా భావోద్వేగాలను పండించేలా ఉంటుందని వెల్లడించారు.
ఈ చిత్రంలో హీరోగా మనోజ్, హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రల్లో అప్పారావు, చిత్రం శ్రీను నటించగా, ప్రతినాయకుడి పాత్రలో సర్కార్ కనిపించనున్నారు. చిత్రంలోని ఆరు పాటలు, మూడు యాక్షన్ ఎపిసోడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న రమేష్ బాబు చెరుకూరు (డల్లాస్) తెలుగు సినిమాపై ఉన్న అభిరుచితో ఎన్నో ఏళ్లుగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. తన బిజీ జీవితాన్ని పక్కనపెట్టి స్వదేశానికి వచ్చి, ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడిగా ఇది తన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని విలువైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..ప్రపంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుదల.
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇదే సమయంలో ఈ సినిమాను 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసినట్లు చూపించారు. ఈ సెలబ్రేషన్‌ను భారత క్రికెట్లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైన కొత్త యుగానికి ప్రతీకగా భావిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నంగా ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తులుగా మిగిలాయి.
‘దాదా- ది సౌరవ్ గంగూలీ’ సినిమా క్రికెట్ ఆట ఆడిన వ్యక్తి మాత్రమే కాకుండా దానిని మార్చిన మనిషి అసాధారణ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఒక ప్రతిభావంతుడైన యువ క్రికెటర్‌గా ప్రారంభమై భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరిగా ఎదిగిన గంగూలీ ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. పట్టుదల, పోరాడే శక్తి, నమ్మకం వంటి లక్షణాలు భారత క్రికెట్‌ను ఎలా కొత్తగా మలిచాయో, ఒక తరం మొత్తానికి ఎలా ప్రేరణగా నిలిచాయో ఈ సినిమా ద్వారా చూపించనున్నారు.
‘దాదా- ది సౌరవ్ గంగూలీ’ సినిమాకు విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్, డీబీఎల్ సమర్పణలో, లవ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027, మే 14న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.
లవ్ ఓ లవ్ ప్రీ-రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చిత్ర బృందం, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది. పావిష్ నారాయణన్, నాగ దుర్గా జంటగా నటించిన ఈ చిత్రానికి మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, జి. నాగేశ్వర రెడ్డి గార్లు కూడా హాజరై చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. లవ్ ఓ లవ్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్ర యూనిట్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ, “ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవిష్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించాడు. నేను ప్రస్తుతం ఏ నగరానికి ఏమైంది 2 సినిమా షూటింగ్లో ఉన్నాను. ఈరోజు పవిష్ సినిమా ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉందని తరుణ్ భాస్కర్‌కు చెప్పగా, ఆయన కూడా రెండు గంటల ముందే షూటింగ్ నుంచి వెళ్లమని ప్రోత్సహించారు. లవ్ ఓ లవ్ గురించి చెప్పాలంటే, ఇది భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే యూనివర్సల్ రొమాంటిక్ కామెడీ చిత్రంలా అనిపిస్తోంది. కథ, కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారు. అది తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా ఎలాంటి తేడా చూపించరు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో మనందరికీ తెలుసు. అదే విధంగా పవిష్ కూడా ఆ జాబితాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ ఓ లవ్ తెలుగు ప్రేక్షకుల ప్రేమను సొంతం చేసుకుని ఘన విజయాన్ని అందుకోవాలని చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.”
నిర్మాత జి. ధనంజేయన్ మాట్లాడుతూ , “విశ్వక్ సర్‌కు నేను పెద్ద అభిమానిని. మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి నేను మాట్లాడటం కంటే సుబ్బారావు గారు మాట్లాడితే బాగుంటుందని భావించాను. ఆయన ఈ సినిమాపై ఎంతో గౌరవంతో వ్యవహరిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తానని ముందుకు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నాగ దుర్గా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన నటి. అలాగే ధనుష్ గారి మేనల్లుడు పావిష్ తన గత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమై మంచి ఆదరణ పొందాడు. ఈ సందర్భంగా సుబ్బారావు గారికి మరోసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేడు తమిళ వెర్షన్‌కు సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ మాట్లాడుతూ, “ఈ అవకాశం ఇచ్చిన దినేష్ సర్, ధనంజేయన్ సర్లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాపై నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం కల్పించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. జూలై 10న లవ్ ఓ లవ్ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు మా చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.”
నిర్మాత దినేష్ రాజ్ మాట్లాడుతూ, “ధనంజేయన్ గారితో కలిసి చేస్తున్న నా తొలి చిత్రం లవ్ ఓ లవ్. మా ఈ భాగస్వామ్యంలో మరో ఆరు చిత్రాలను కూడా నిర్మించబోతున్నాం. ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దర్శకుడు మాగేశ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు. సినిమాపై అద్భుతమైన అవగాహన, స్పష్టమైన విజన్ ఆయన సొంతం. ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేలా, వారితో అనుబంధం కలిగించే అంశాలతో కథను రూపొందించారు. మంచి సందేశాన్ని అందించే చిత్రాన్ని తెరకెక్కించగలిగామని మేము గర్వంగా భావిస్తున్నాం.
హీరో పవిష్ చాలా అంకితభావం కలిగిన నటుడు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిస్థాయిలో కష్టపడి తన వంతు సహకారాన్ని అందించారు. అలాగే హీరోయిన్ నాగ దుర్గా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితురాలు. ఆమెను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు మద్దతు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
హీరో పవిష్ నారాయణన్ మాట్లాడుతూ, “ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ సర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక ఫోన్ కాల్ చేయగానే కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందించి ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. విశ్వక్ సర్ నటిస్తున్న ప్రతి సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, సినీ ప్రముఖులకు, అభిమానులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా తెలుగు అంత బాగా రాకపోయినా మీతో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఎప్పుడైనా వేదికపై మాట్లాడినప్పుడు ముందుగా ధనుష్ సర్‌కు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను.
అలాగే ధనంజేయన్ సర్, దినేష్ రాజ్ సర్లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి సినిమా ఎంత ముఖ్యమో, రెండో సినిమా కూడా అంతే ముఖ్యమని భావించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. దర్శకుడు మాగేశ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా తొలి సినిమాలో ఏమి చూసి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారో నాకు తెలియదు కానీ, ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంతో నేర్చుకున్నాను. మొదట ఈ సినిమాలో నా సరసన కొత్త హీరోయిన్ నటిస్తుందని చెప్పారు. కానీ నాగ దుర్గ గారి గురించి తెలుసుకున్న తర్వాత, తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఎంతటి గుర్తింపు ఉందో చూసి ఆశ్చర్యపోయాను. ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నాగ దుర్గ గారే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రంలో నాతో కలిసి నటించిన సీనియర్ నటీనటులు వనిత విజయకుమార్ మేడమ్, కె.ఎస్. రవికుమార్ సర్, సెల్వా సర్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.జూలై 10న లవ్ ఓ లవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆశీర్వదించండి. మీ ప్రేమాభిమానాలే మా బలం. అందరికీ ధన్యవాదాలు.”
హీరోయిన్ నాగ దుర్గా మాట్లాడుతూ, “ఈ సినిమాలో అవకాశం రావడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక తెలుగు అమ్మాయిగా తమిళ చిత్రంతో పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటిగా నన్ను ఎంపిక చేసిన దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన ధనంజేయన్ సర్, దినేష్ రాజ్ సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తన బిజీ షెడ్యూల్లో కూడా సమయం కేటాయించి మా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మాకు అందించిన ప్రోత్సాహం ఎంతో విలువైనది. లవ్ ఓ లవ్ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాల్సిన చిత్రం. జూలై 10న విడుదల కానున్న మా సినిమాను అందరూ థియేటర్లకు వచ్చి చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.”
నటి వనిత విజయకుమార్ మాట్లాడుతూ, “మరోసారి హైదరాబాద్‌కు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి సందర్భంలోనూ నాకు అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
లవ్ ఓ లవ్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 10న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేస్తున్న తెలుగు నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇవాళ నాంపల్లి కోర్టులో జరిగింది. ప్రస్తుతం షూటింగ్ కోసం ముంబైలో ఉన్న కారణంగా, అల్లు అర్జున్ ఈ విచారణకు కోర్టు అనుమతితో వర్చువల్ గా హాజరయ్యారు. గత వాయిదా సమయంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరగా, న్యాయస్థానం నేడు ఆయనను వర్చువల్‌గా విచారణలో పాల్గొనేందుకు అనుమతించింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌కు సంబంధించి కీలక ప్రక్రియ ఇవాళ పూర్తయింది. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చింది. కోర్టు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) నిందితులందరికీ దాదాపు 500 పేజీల భారీ ఛార్జిషీట్ కాపీలను అధికారికంగా అందజేశారు.
ఛార్జీషీట్ కాపీల పంపిణీ అనంతరం న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప – 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ముంబైలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఇది ఆమిర్ ఖాన్‌కు మూడో వివాహం. ఈ వేడుకలో ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ క్రీమ్, లేత గోధుమ రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. వివాహ పత్రాలపై ఆమిర్ సంతకం చేస్తున్న ఫోటోను ఆయన ప్రతినిధి విడుదల చేశారు. ఈ పెళ్లికి ఆమిర్ మొదటి భార్య పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్‌తో పాటు, రెండో భార్య కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కూడా హాజరయ్యారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా, దర్శకుడు అశుతోష్ గోవారికర్, నటుడు వీర్ దాస్, రాజకీయ నాయకుడు రాజ్ థాకరే వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ ఏడాది మార్చిలో తన 60వ పుట్టినరోజున గౌరీతో పెళ్లి విషయాన్ని ఆమిర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. జులై 5న ఇంట్లోనే చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నామని… ఇరు కుటుంబాలు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరవుతారు అని ఆయన అప్పుడు తెలిపారు. ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకుని, 2002లో విడిపోయారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకుని, 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక గౌరీ స్ప్రాట్ ఫ్యాషన్ రంగంలో పనిచేశారు. గతంలో ఆమెకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. గౌరీ, తాను 25 ఏళ్లుగా స్నేహితులమని, ఇటీవలే ప్రేమలో పడ్డామని అమీర్ కొంతకాలం కిందట వెల్లడించారు.
సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్ సమంత.
సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమవుతున్నారు. అతి పెద్ద ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన సోనీ లివ్ తమిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తోంది. అందులో సమంత ప్రధాన పాత్రలో మెప్పించనుండటం విశేషం. ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ క్రేజీ అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల్ని నిర్మాతలు వివరాలను గోప్యంగా ఉంచారు.
ఒక వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే. ఈ క్రమంలోనే సమంత ఈ కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. తమిళ్లో సోనీ లివ్‌లో సమంత చేయబోతోన్న ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించినప్పటికీ ప్రేక్షకులు, అభిమానులు మాత్రం దీని గురించి చర్చించుకుంటున్నారు.
ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి సమంత తన సోషల్ మీడియాలో విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేం ఎంతో ఆసక్తికరమైన ఒక విషయంపై వర్క్ చేస్తున్నాం. త్వరలోనే దానిని మీ అందరితో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
సోనీ లివ్ తమిళ్‌తో కలిసి సమంత చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం అనౌన్స్మెంట్- ధృవ్ విక్రమ్, కరణ్ అరవింద్ కుమార్, ‘మైత్రీ మూవీ మేకర్స్’ #MythriTamil04 #DV4 పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం
ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో వారి నాలుగవ తమిళ చిత్రాన్ని ప్రకటించారు. ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న నాలుగవ చిత్రం కావడం విశేషం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
చెన్నైలోని MRC నగర్ మైత్రీ ఆఫీస్ లో జరిగిన పూజా కార్యక్రమంతో #MythriTamil04 #DV4 ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు.ధృవ్ విక్రమ్, దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్, చిత్ర బృందంతో కలిసి ఈ శుభకార్యంలో పాల్గొన్నారు.
ముహూర్తం షాట్ కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్‌బోర్డ్ కొట్టారు. దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, కీర్తిశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.
నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం (DV4), ధృవ్ విక్రమ్‌ను పూర్తిగా మాస్-ఓరియెంటెడ్ అవతార్‌లో కనిపించనున్నారు. నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలతో ప్రయోగాలు చేయడానికి పేరుపొందిన ధృవ్ , ఇప్పుడు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం సిద్ధమయ్యారు.
కరణ్ అరవింద్ కుమార్, సబీతో కలిసి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వికీ నిర్వహించనుండగా, జయసూర్య ఎడిటర్. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా, ప్రొడక్షన్ డిజైనర్ జి.ఎం. శేఖర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థతో జరుగుతున్న కాపీరైట్ వివాదంలో కీలక తీర్పునిచ్చింది. గతంలో ఇళయరాజాకు వ్యతిరేకంగా ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. ఇళయరాజా తాను సృష్టించిన ట్యూన్లపై మాత్రమే కాపీరైట్ హక్కులను కలిగి ఉంటారని, సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగ్స్‌పై ఆయనకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 14(A) ప్రకారం కేవలం సాహిత్యం మినహాయించిన ట్యూన్స్ వరకే ఇళయరాజాకు హక్కులు ఉంటాయని.. సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగులను ఆయన సొంతంగా వాడుకుంటే అది కాపీరైట్ ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది. దీంతో134 సినిమాల్లోని పాటలపై ఇళయరాజాకు ప్రస్తుతానికి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టమైంది.
1976 నుంచి 2001 మధ్య కాలంలో విడుదలైన పలు చిత్రాల నిర్మాతలతో తాము అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నామని సరిగమ పేర్కొంది. ఈ ఒప్పందాల ప్రకారం ఆయా సినిమాల్లోని పాటల పూర్తి సౌండ్ రికార్డింగ్స్, సంగీతం, సాహిత్య పరమైన కాపీరైట్ హక్కులు చట్టబద్ధంగా తమకే సొంతమని ఆ సంస్థ వాదిస్తోంది. అయితే సరిగమ సంస్థకు హక్కులున్న ఈ 134 సినిమాల పాటలను ఇళయరాజా తన సొంత ఆస్తులుగా పేర్కొంటూ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్లోడ్ చేశారు. దీంతో సరిగమ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు.. పూర్తి సౌండ్ రికార్డింగ్‌పై ఇళయ రాజాకు హక్కులు ఉండవని తీర్పునిచ్చింది.
▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ
▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభం
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ ‘అంబ’s రివెంజ్’ చిత్రం ముస్తాబవుతోంది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్ & డెవలప్మెంట్ను ‘కాలై విజువల్ స్టూడియోస్’ అందిస్తోంది. పూర్తి స్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత యోగేంద్ర పొట్లూరి, దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ, తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని తెలిపారు. చిత్ర నిర్మాణంలోని పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని, ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.
టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
పురాణ ఇతివృత్తాన్ని అత్యాధునిక కృత్రిమ మేధ సాంకేతికతతో మేళవిస్తూ రూపొందుతున్న ‘అంబ’s రివెంజ్’ ఇప్పటికే సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏఐ ఆధారిత కథా నిర్మాణానికి నాంది పలికే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని కలిగిస్తోంది.





Total views : 199093