Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News నల్గొండలో ఆర్‌ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.

నల్గొండలో ఆర్‌ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.

by CVR NEWS

నల్గొండ జిల్లాలో భూ రీ-సర్వే కార్యక్రమంపై తీవ్ర వివాదం నెలకొంది. శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన సదస్సులో రెవెన్యూ అధికారుల ఎదుటే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కెళ్లపహాడ్ గ్రామ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఆర్‌ఐ రఫీపై అవినీతి, రికార్డుల తారుమారు, రైతులను బెదిరించడం వంటి ఆరోపణలు గుప్పించారు. మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేసి భూముల సర్వే చేయకుండా రికార్డుల్లో మార్పులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తూ ఆర్డీవో, కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ నెల 14న ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి ఆర్‌ఐ రఫీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ చర్యలు లేకపోవడంతో మరోసారి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. పట్టాలు లేని భూములను డబ్బులు తీసుకుని రికార్డుల్లో నమోదు చేస్తున్నారని, అసలు అర్హులైన రైతుల పనులను ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అంతేకాదు… ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకు 500 రూపాయలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి దరఖాస్తులకు 5 వేల రూపాయల వరకు, రేషన్ కార్డుకు 1,500, భూముల సర్వేలకు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఫైళ్లు కదలవని, పాస్‌బుక్కులు రద్దు చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

సంబంధిత రెవెన్యూ అధికారులు ,, ఆర్‌ఐ రఫీ నుంచి దీనిపై అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఫిర్యాదులపై విచారణ అనంతరం వాస్తవాలు తేలాల్సి ఉంది. రైతులు మాత్రం రఫీని తక్కెళ్లపహాడ్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042040
Total views : 221436

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: