ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వైద్యులు మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయన తన పర్యటనల షెడ్యూల్‌ను వాయిదా వేసి, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచే అధికారిక విధులు నిర్వహించాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స అనంతరం అధికారిక కార్యక్రమాలకు హాజరుకావాలని నిర్ణయించిన పవన్ కళ్యాణ్, పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల పర్యటనలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి ముందుగా సూచించారు.
అయితే జనసమూహం మధ్య జరిగే క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో శస్త్రచికిత్స చేసిన కుడి భుజానికి స్వల్ప అసౌకర్యం కలిగినా గాయం తిరిగి తెరుచుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే మళ్లీ చికిత్స చేయడం క్లిష్టమవుతుందని, ఎడమ భుజంపైనా అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించడంతో, పర్యటనల షెడ్యూల్‌ను మార్చాలని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఆదేశించారు.
అదే సమయంలో ప్రభుత్వ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచే శాఖల పనులను సమీక్షిస్తూ అధికారిక విధులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.




Total views : 221453