Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

by CVR NEWS

కంచే చేను మేస్తే దిక్కెవరు..? కాపాడాల్సిన వారే కబళిస్తుంటే ఇక అడ్డుకునేదెవరు..? శ్రీ కాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. ఇక్కడి వంశధార నదీ తీరం అక్రమ తవ్వకాలతో కుదేలవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, పగలు రాత్రి తేడా లేకుండా వందలాది లారీలతో ఇసుకను ఒరిస్సా తరలిస్తున్నారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది.
హిరమండలం మండలంలోని భగీరథపురం, రుగడ గ్రామ సమీపంలో ఉన్న పొంటూరు ఇసుక రీచ్‌ల నుంచి భారీ ఎత్తున అక్రమ రవాణా సాగుతోంది. నిత్యం వందలాది లోడ్ల ఇసుక ఇక్కడి నుంచి ఒరిస్సా తరలిపోతోంది.
తమకు ఎమ్మెల్యేనే అనుమతి ఇచ్చారని.. ప్రతి లోడుకు ఆయనకు ఆరు వందల రూపాయలు చెల్లిస్తున్నామంటూ కాంట్రాక్టర్ అనుచరులు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం..
ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ యంత్రాంగం గానీ, ఇటు మైనింగ్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులకు కూడా మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేను మందలించినట్లు ప్రచారం జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఇదంతా చూస్తుంటే ఈ మాఫియా ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది.
పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు, హిరమండలం ప్రాంతాల్లో ఇసుక దోపిడీ పరాకాష్టకు చేరింది. మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే ఈ అక్రమాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంపదను దోచుకుంటూ, నదీ తీరాలను నాశనం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అరికడతారో లేదో చూడాలి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: