ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్యానాకు చెందిన కుటుంబం హరిద్వార్ వెళ్తుండగా దారి తప్పి, ఎగ్జిట్ కోసం కారును వెనక్కి తీస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లా, ‘హల్గోయా కట్’ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం హరిద్వార్‌కు కారులో బయలుదేరింది. కాగా, వీరు ప్రయాణిస్తున్న కారు సరైన ఎగ్జిట్ వేను మిస్ కావడంతో.. దానిని రివర్స్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అతివేగంగా వచ్చిన స్కార్పియో కారు, వీరున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ , అతని భార్య ప్రీతి , వృద్ధురాలైన సుదేశ్, మరియు తొమ్మిదేళ్ల బాలుడు శివాన్ష్ ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Crime
ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ అనంతర పరిణామాలపై సురేష్‌ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన తరువాత సీఐ నాగరాజుకి సురేష్ సహకరించినట్లు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు.
ఐతే సాయికృష్ణ లాకప్ డెత్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని జాడ ఇంకా కనిపించలేదు. సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో వీరి పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వారి కోసం వేట కొనసాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపర్చాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్ నిందితులుగా చేర్చింది. వారిద్దరినీ నగర సీపీ రాజశేఖరబాబు సస్పెండ్ చేశారు. వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు.
కృష్ణలంక స్టేషన్లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన పదిమందిపై సిట్ గురిపెట్టింది. వీరిలో కీలకంగా ఉన్న సురేష్ నుంచి పలు వివరాలు సేకరిస్తోంది సిట్. టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి పిలిచి విచారించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే రెండుసార్లు విచారించారు. స్టేషన్లో సెక్షన్ ఇన్‌ఛార్జి అయిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, అలాగే బాబూరావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు.. సౌత్ ఏసీపీ మానసపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే.. అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇన్స్పెక్టర్పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..సాయికృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్..సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కేసులో దర్యాప్తు పురోగతి, న్యాయస్థానానికి నివేదించాల్సిన అంశాలపై సిట్ అధికారులు.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు విచారణలో వెలుగుచూసిన అంశాలపై చర్చించారు.
అన్నమయ్య జిల్లా పీలేరులో ఓ మైనర్ బాలిక చేసిన ఫిర్యాదు స్థానికంగా కలకలం రేపింది. అరబిక్ ట్యూషన్ నిర్వహిస్తున్న 50 ఏళ్ల వ్యక్తి ఒక బాలికను అసభ్యంగా తాకాడని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సంబంధిత వ్యక్తిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సీఐ వెంకటేశ్వర్లు జోక్యంతో పరిస్థితి అదుపులోకి రాగా, పోలీసులు కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో సినిమాను తలపించేలా హైడ్రామా నడిచింది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్, 11 ఏళ్ల బాలికను ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. ఐతే ఆ బాలికను ఢీకొట్టిన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు దాదాపు 60 కిలోమీటర్ల దూరం..రెండు గంటల పాటు ఛేజింగ్ చేసి మరీ చివరకు అతడిని అరెస్ట్ చేశారు. రాజ్‌నంద్‌గావ్-మాన్పూర్ రహదారిపై ఉన్న గుండర్దేహి గ్రామంలో జరిగింది ఈ దారుణ ఘటన. వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు పూనమ్ అనే 11 ఏళ్ల బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, డ్రైవర్ ట్రక్కును ఆపకుండా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మోహ్లా వైపు వేగంగా పారిపోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మోహ్లా పోలీస్ స్టేషన్ వెలుపల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, డ్రైవర్ అక్కడే ఆగి ఉన్న మరో ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టి, పోలీసు బ్యారికేడ్లను బద్దలు కొట్టుకుని ముందుకు దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు మాన్పూర్లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద మరోసారి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. డ్రైవర్ వాటిని కూడా ఢీకొట్టి, బారికేడ్లలోని కొన్ని భాగాలను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సమయంలో పోలీసులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
దాదాపు 60 కిలోమీటర్ల ఉత్కంఠభరితమైన ఛేజింగ్ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్కోట్టి గ్రామ సమీపంలో ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి, చికిత్స కోసం మాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంతో ఆగ్రహానికి గురైన గుండర్దేహి గ్రామస్థులు, బాలిక మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రెండు గంటల పాటు రాకపోకలను అడ్డుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య కేవలం సాధారణ పరిచయమే కాకుండా చాలా లోతైన వ్యక్తిగత సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య గత కొన్ని నెలల్లో వేలసార్లు ఫోన్ కాల్స్ జరగడం, హత్యకు ముందు రోజు ప్రత్యేకంగా సమావేశం కావడం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తును కొత్త కోణంలోకి తీసుకెళుతున్నాయి. నిందితుడు చేతన్ చౌదరి..సియా గోయల్ అన్న సాహిల్ గోయల్‌కు క్రికెట్ ద్వారా మిత్రుడు. సాహిల్‌తో కలిసి చేతన్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవాడు. ఆ సమయంలో సియా తరచుగా తన సోదరుడితో పాటు మ్యాచ్‌లకు వెళ్లేది. అప్పుడే వారిద్దరి మధ్య తొలి పరిచయం ఏర్పడిందని భావిస్తున్నారు పోలీసులు. ఆ తర్వాత 2025 దీపావళి సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య సంభాషణలు, రాకపోకలు బాగా పెరిగాయి. విచారణలో భాగంగా పరిశీలించిన కాల్ డేటా రికార్డులు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సియా, చేతన్ మధ్య ఏకంగా 2 వేల 4 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్స్ మొత్తం వ్యవధి దాదాపు 238 గంటలు ఉండటం వారి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న సియా సోదరుడు సాహిల్ గోయల్‌ను దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు..సియా కుటుంబంలోని ఇతర సభ్యుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ కేసులో డిజిటల్ ఆధారాలు అత్యంత కీలకంగా మారాయి. నిందితులిద్దరూ తమ ఫోన్లలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాట్లతో పాటు ఇతర ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. లోహగఢ్ సంఘటనకు ముందు, ఆ తర్వాత కూడా ఈ సంభాషణలను తొలగించారని అనుమానిస్తున్నారు. కేవలం మెసేజ్‌లు డిలీట్ చేయడమే కాకుండా, రీసైకిల్ బిన్లను కూడా ఖాళీ చేయడంతో, డిలీట్ అయిన డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే..దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ అగర్వాల్ హత్య జరగడానికి ఒక రోజు ముందు, అంటే జూన్ 17న, సియా, చేతన్.. పూణెలోని లుల్లానగర్ ప్రాంతంలో ఉన్న ఓ కేఫేలో సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు దాదాపు గంట పాటు వీరిద్దరూ అక్కడే గడిపారు. ఈ సమావేశంలోనే హత్యకు సంబంధించిన కుట్ర జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ భేటీ వివరాలు, డిజిటల్ ఆధారాల విశ్లేషణతో కేసులో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో మరో మోసగాడు పోలీసులకు చిక్కాడు. తాను సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడినని… హైదరాబాద్ సీపీకి స్నేహితుడినని చెప్పుకుంటూ ప్రజలను నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన ఓల్డ్ సిటీ గోల్డ్ మెన్ సూర్య భాయ్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పించి ఇస్తానంటూ పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన గోల్డ్ మెన్ సూర్యకుమార్ అనే వ్యక్తి, చివరకు మోసపూరిత వ్యవహారం బయటపడటంతో పోలీసుల వలలో చిక్కాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఉగ్రవాదులు సాంకేతికతను వాడుకుని అత్యంత పక్కాగా ఈ దాడులకు వ్యూహం రచించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. పహల్గామ్లో దాడులు చేయడానికి ఉగ్రవాదులు వారం రోజుల ముందే కుట్ర పన్నారు. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బైసారన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రణాళిక రచించారు. లొకేషన్లను ట్రాక్ చేయడానికి, సాధారణంగా పర్యాటకులు, కొండలు ఎక్కే ట్రెక్కర్స్ ఉపయోగించే మొబైల్ అప్లికేషన్లు, GPS టెక్నాలజీని ఉగ్రవాదులు వాడుకున్నారు. దాడి చేసిన తర్వాత సురక్షితంగా తప్పించుకోవడానికి కూడా ఈ జీపీఎస్ యాప్‌ల ద్వారానే రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఫోన్లలో పాకిస్తాన్‌లోని తమ కమాండర్లు, లీడర్లతో ఉగ్రవాదులు నిరంతరం చాటింగ్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పర్యాటకులు తమ రక్షణ, సురక్షిత గమ్యస్థానాల కోసం ఉపయోగించే మొబైల్ యాప్‌లను ఉగ్రవాదులు తమ డిజిటల్ విద్రోహ చర్యలకు వాడుకోవడం జమ్ముకశ్మీర్ భద్రతా బలగాలకు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. ఈ సాంకేతిక ఆధారాల ద్వారా ఉగ్రవాదుల స్థానిక నెట్వర్క్, వారికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ఎన్ఐఏ నిఘాను మరింత తీవ్రం చేసింది.
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మెహఫిల్ హోటల్ సమీపంలో బాలెనో కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు , 7 సజీవ బుల్లెట్లు, ఒక బాలెనో కారు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అరెస్టైన వారిలో హైదరాబాద్ చార్మినార్ కిల్వత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్ ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ఉన్నారు. షా బాబాపై కర్ణాటకలో డాకోయిటీ, మహారాష్ట్రలో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులు నమోదై ఉండగా, అమీర్ ఖాన్‌పై హత్య కేసుతో పాటు పలు నేర కేసులు ఉన్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో పెద్ద నేరానికి కుట్ర పన్నుతున్న సమయంలో వీరిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తుపాకులతో బెదిరించి దారిదోపిడీలకు పాల్పడటం వీరి ప్రధాన నేర కార్యకలాపంగా గుర్తించారు.
రేణిగుంట బుగ్గవీధి ప్రాంతంలో రైల్వే శాఖ టెక్నీషియన్ కిల్లి రవి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో పాటు ఓ మహిళతో వివాదం కారణంగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు. సోదరుడికి వాట్సాప్ సందేశం పంపిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .
హైదరాబాద్ నగరంలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు చోరీ ఘటన సంచలనం రేపింది .రీన్‌బజార్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై ఏటీఎంలకు నగదు తరలిస్తున్న క్యాష్ వాహన డ్రైవర్ రూ.17 లక్షల నగదుతో పరారైయ్యాడు . పక్కా ప్రణాళికతో నగదు అపహరించిన నిందితుడు ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు కొనసాగుతుండగా , కొన్ని ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం వెతుకుతున్నాయి. నగదు రవాణా భద్రతపై అధికారులు సమీక్ష ప్రారంభించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.





Total views : 199092