మనం వెలిగించిన దీపం పంచభూతాలతో పాటు, నవ గ్రహాల కలయిక అని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. మహాలక్ష్మి స్వరూపమైన దీపం మనకు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. వెలిగించిన దీపం పంచభూతాలు మాత్రమే కాకుండా, నవగ్రహాలకు ప్రతీక అని కూడాచెప్పవచ్చు. దీపపు ప్రమిదను సూర్యుని గా భావించాలి, అందులో మనం పోసిన నూనెను చంద్రుని అంశంగా వెలిగే దీపపు జ్వాలను కుజుడుగా, వెలిగే జ్వాలలో ఉన్న పసుపు రంగును గురుడుగా భావించాలి. అలాగే దీపం వెలుగుతునప్పుడు పడే నీడను రాహువుగా, దీపం నుంచి వెలువడే కాంతి కిరణాలు శుక్రుడుగా, దీపం వెలిగించడం అనే పుణ్యకార్యం వల్ల మనం పొందే మోక్షమే కేతువు అని శాస్త్రం తెలియజేస్తుంది. అయితే చివరగా దీపం కొండెక్కిన తర్వాత నల్లగా మారుతుంది దానిని శనిగా భావించాలి. అందుకే నిత్యం దిపారాధన చేసే ఇంటివారికి నవగ్రహదోషాలు వుండవు అని పరిహార శాస్త్రం వివరిస్తున్నది. ఇలా పంచభూతాలు, నవగ్రహాల కలయికతో వెలిగించే దీపం శుభాలకు నిలయం. ఇక నూనెతో వెలిగించిన దీపం వెలుగులో ఎరుపు, నీలం, తెలుపు రంగులు కనిపిస్తాయి. ఆ మూడు రంగులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలని మన ధర్మశాస్త్రం తెలుపుతుంది. దీపాలు సంపదలకు చిహ్నం. చీకటి అంధకారాన్ని పోగొట్టి దారి చూపించడమే కాదు నువ్వుల నూనెతో పెట్టె దీపం ప్రకృతికి ఎంతో మేలు చేస్తుందని అనేక పరిశోధనలు వివరించాయి. శాస్త్ర ప్రకారం దేవాలయంలో, ఇంట్లో దీపాన్ని రెండు పూటలా వెలిగించాలి. మహాలక్ష్మిదేవి ఆరాధనలో అన్నింటికంటే ముఖ్యమైనది దీప ప్రజ్వలన. పంచముఖ దీపాలను వెలిగించి పంచభూతాలకు సంకేతంగా భావించి పవిత్రమైన మనసుతో దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వతమో పహః, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అనే మంత్రాన్ని చదివి, దీపంకి పువ్వులను సమర్పించి నమస్కరిస్తే దీపలక్ష్మి సంతోషంతో సకల సంపదలను అనుగ్రహిస్తుందని పురాణవచనం, దీపారాధనతో శుభం కలుగుతుంది. ఇలా చేస్తే కుటుంబంలో ఉన్న వారికి చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే దీపం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దల మాట. దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంధకారాన్ని పోగొట్టి కాంతులను నింపేది దీపం. ఇక మనందరి జీవితంలో అప్పుడప్పుడు కలిగే చీకటి,అజ్ఞానం,బాధలు, కష్టాలను పోగొట్టి తన వెలుగుతో మన జీవితాలకి దారి చూపిస్తుంది దీపం. దీపావళి రోజున వెలిగించే దీపాలు కష్టాలు అనే చీకటిని తొలగించి సుఖం అనే వెలుగులనిస్తాయి. కనుక దీపావళి నాడు దీపలక్ష్మి కి తప్పక నేతి దీపాలతో పూజచేయండి. ప్రతి రోజూ దేవుడి ముందు దీపాన్ని వెలిగించి చెడు తొలగి మంచి జరగాలని కోరుకోండి. దీపం వెలుగు మనిషిలోని సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక అని, దీపం వెలిగించటం వల్ల మనలోని సత్వగుణం పెరుగుతుందని నమ్ముతాం. అందుకే దీపం లో మూడు వత్తులు వేసి ఒక వత్తుగా చేసి వెలిగించే ఆచారం వుంది. ఇక ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువుతీరుతుందని ఋగ్వేదంలో వుంది.
Read Also..