నలుగురు కొత్త న్యాయమూర్తుల రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జడ్జిలు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ అందుబాటులోకి రావడంతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమూల మార్పులు చేశారు. సీనియర్ న్యాయమూర్తుల పక్కన కొత్తవారికి స్థానం కల్పించారు. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కీలకమైన బెయిల్ పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించారు. 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పిటిషన్లను కూడా ఆయనే పరిశీలించనున్నారు. ఇక కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బీఎస్ భానుమతికి కేటాయించారు. ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ 2022 తర్వాత దాఖలైన వ్యాజ్యాలను భానుమతే విచారిస్తారు. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన కేసులను అప్పగించారు. ఈ కొత్త రోస్టర్ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక పురపాలక శాఖ, ఏపీసీఆర్డీఏ, ఏఎంఆర్డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, రెవెన్యూ, భూసేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవిలకే కేటాయించారు. ఇప్పటివరకు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి ఇకపై ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లను కొట్టివేయాలంటూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్లపై పరిశీలించనున్నారు. అంతేకాదు 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను ఆయనే విచారిస్తారు. జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను అప్పగించారు. ఇప్పటివరకు క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్ల కేసుల బాధ్యతలు కేటాయించారు. కాగా ఈ రోస్టర్లో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ ట్రాన్స్ఫర్పై వేరే హైకోర్టులకు వెళ్తుండడమే ఇందుకు కారణంగా ఉంది. మరోవైపు కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ జీ.నరేంద్ర బదిలీ ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి తాజా రోస్టర్లో కొన్ని మార్పులు అనివార్యం కానుంది.
హైకోర్టు రోస్టర్లో కీలకమైన మార్పులు
115
previous post