భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు. సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి, అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు.
ప్రాణ వాయు శివలింగం:
శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు.
శ్రీకాళహస్తి విశేషాలు:
శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కధనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తిక్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహా భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరున్ని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతిపురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకూ అడుగడుగునా ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.
Read Also..
Read Also..