కాశీయాత్ర చేసి వచ్చిన తరువాత కాలభైరవుని రూపంగా వున్న కుక్కకు గారెల దండ వెయ్యాలి. లేకపోతే కాశీయాత్ర ఫలించదని కొందరు పురోహితులు అక్కడక్కడ చెప్తుంటారు. మరి కొందరు కుక్కకు పూజలు కూడా చెయమని పరిహారాల్లో భాగంగా చెపుతారు. అయితే పొరపాటున కుక్క ముట్టుకుంటే స్నానం చేసే ఆనవాయితీ ఉన్న కుటుంబాలు అనేకం వున్నాయి. కానీ ఇలా పూజలు, పరిహారాలు చేయకపోతే కాశీయాత్రాఫలం దక్కదంటు అనేక మంది అంటుటారు. అసలు వాస్తవాలేంటో తెల్సుకుందాం.
కాశీయాత్ర చేసివస్తే కుక్కకు దండ వెయ్యాలని ఏ శాస్త్రంలోనూ లేదు అనేది పెద్దలకి తెల్సినా, అంతగా దీనిని పట్టించుకోటంలేదనేది వాస్తవం. కాలభైరవుడి వాహనం శునకం అనేది శాస్త్ర సమ్మతమే. ఆ శునకం దేవతాస్వరూపమే. కానీ కాలభైరవుడు శునకరూపుడు కాదు…ఇది నిజం. శ్రీమహావిష్ణవు దశావతారాల్లో వరాహరూపం ఒకటని మనందరికీ తెల్సినా.. ఊరిబయట తిరిగే వాటిని మనం ఎన్నడూ దైవసమానంగా చూడలేదు, అంటే యాజ్ఞవరాహానికి, ఊరపందికి పోలికే లేదు. ఊరపందిని వరాహస్వామి అనడం విడ్డూరం, పైగా పాపం కూడా… అలాగే కాశీయా- కుక్కకు గారేల దండా.. పూజలు. సనాతన సంప్రదాయం కుటుంబాలు మంచి ఆనవాయితీని ఇప్పటికీ అనుసరించటం శ్లాఘనీయం.. శాస్త్రబద్ధం. దానిని వదలవద్దు అని పండితులు అంటుంటారు.శాస్త్ర సమ్మతం కానివి ఆచరించవద్దు.
శునకాలు బలిభుక్కులు. కాకులను కూడా ఇలాగే చూస్తాము. పూజానంతరం నివేదిత పదార్థాలు కొద్దిగా తీసి, వేరే పాత్రలో వుంచి, ఇంటి బయట శునకానికి, కాకులకు వేస్తారు…ఇలా చేయటం కొందరికి ఆచారంగా వుంటుంది కూడా. ఇది బలినివేదన. బలి సందర్భంలో ఆ ప్రత్యేక దేవతలకిచ్చిన పదార్థాలను శునకాలకు మాత్రమే ఇస్తారు. అది కూడా వీధిలో – వాటిని తాకకుండానే, అలాగే ఏవో గారెలు లాంటివి కుక్కకి పెడితే తప్పులేదు. అంతేగానీ వాటికి మాలలు వేయడం, కుక్కనే భైరవుడు అనుకోవడం తగదు. అలాగని కుక్కని తక్కువచేసి చూడనక్కర్లేదు. వాటిని చూడవలసిన విధంగా చూడాలి. ఇళ్లల్లో, దేవత మందిరాల్లో కుక్కలు తిరిగితే మంచిది కాదు అని కొన్ని గ్రంధాల్లో చెప్పటం జరిగింది. ఇది శాస్త్ర ప్రమాణం. నేటి ఆదునిక కాలంలో హోదాకోసం, రక్షణకోసం కుక్కలను పెంచుకున్నా వాటికి తగిన విధంగా ఇంటి బయట లేదా వీధి గేటుదగ్గర వుండేట్టు చూసుకోవాలి. మనం తాకకపోయినా, కాపలాగా ఇంటి బయట ఉంటే తప్పులేదు. దానికి ఆహారం పెట్టినా దోషం కాదు. భూత దయ అవసరమే, కానీ దేని మర్యాద దానిదనే సత్యాన్ని మనం విస్మరించరాదు.లేనిపోని ఆచారాలను, కొత్త సంప్రదాయాలను సృష్ఠించే వారు తప్పక శాస్త్రప్రామాణికంగా వున్న వాటినే పరిహారాలు, విధివిధానాలుగా చెప్పాలితప్ప విరుద్దములైన వాటిని ధర్మబద్దమైనవిగా శాస్త్రసమ్మతమైనవిగా చెప్పరాదు.