ఈ పుణ్యభూమిలో భగవంతుని ఎదోఒక రూపంలో ఆరాధించడం జరుగుతుంటుంది. అయితే అన్ని విధాలైన పూజలలో శక్త్యారాధాన జరుగుతుంటుంది. ఆ శక్తి రూపమే జగన్మాత. చిత్ ప్రధానమైనది బ్రహ్మవిద్య. శక్తి ప్రధానమైనది శ్రీవిద్య. ఈ రెంటికీ భేదం లేదు. ఈ జగత్తు సృష్టి స్థితిలయలను కలిగించే బ్రహ్మమే శక్తి. ఆమె శ్రీమాత. జగజ్జనని. మూలప్రకృతి. మహామాయ. పిపీలికాది బ్రహ్మపర్యంతం వ్యాపించిన శక్తి ఆమె. పరతత్వానికి స్త్రీ పురుష బేధం లేదు. అయితే శక్తి అనే శబ్దం స్త్రీలింగం అయినందున పరబ్రహ్మమైన పరాశక్తి త్రిపురసుందరిగా పూజలందుకుంటొంది. ఆ తల్లి ఆవిర్భావాన్ని బ్రహ్మాండాపురాణంలోని లలితాపాఖ్యానం ద్వారా తెలుసుకోగలం. అందులో హాయగ్రీవుడు శ్రీమాత ప్రాదుర్భావాన్ని, ప్రాభవాన్ని సవివరంగా చెబుతాడు. అనంతరం అగస్త్యుని కోరికపై ఆ తల్లి నామాలను చెబుతాడు. అదే శ్రీలలితా సహస్రం. లోకోత్తర లావణ్య భావంతో, చిన్మయ చైతన్యంతో, అణువు అణువులో ఆడిపాడి ఓలలాడే లీలావతి లితాపరమేశ్వరీదేవి. సమస్తలోక కల్యాణమే ఆమె లక్ష్యం. ఆమె హృదయంలో కరుణా సముద్రం పొంగిపొరలుతుంటుంది. చతుష్పష్టి కళలలో ఆమె ఆరితేరిన కళానిధి. ఆమె మృదుమధుర పలుకులలో సకల కళలు ఉట్టిపడుతుంటాయి. భూదేవి దాహాన్ని తీర్చే తీయని మధుధారలంటే ఆ తల్లికి అమితమైన ఇష్టం. తన చల్లని చూపులతో ఈ సమస్తలోకాలను అనుగ్రహిస్తోంది. ఈ లోకంలో ఆమెను మించిన మంచితనాన్ని మనం ఎక్కడా చూడలేం. సహస్రారం చేరేందుకు దారి చూపే వారుణీనాడి ఆమె చేతిలొ ఉంది. అందుకే ఆమె అనుగ్రహం లభించిన వారికి తెలుసుకోవలసింది అంతా పూర్తిగా తెలిసిపోతుంది. ఆమె మానస సరోవరంలో మందగమనంతో సంచరించే రాజహంసలా తన భక్తుల మనోమందిరంలో నెలకొని ఉంటుంది. మంత్రరూపంలో గోచరించే ఆ తల్లిని ఆరుగురు దేవతలు ఆరాధిస్తారు. హృదయం, శిరస్సు, శిఖ, నేత్రత్రయం, కవచం, ఆస్త్రం – ఇది ప్రతి మంత్రానికి ఉండే అంగన్యాసం. ఇందులో పరమేశ్వరి ఆంగికంగా ఉంటుంది. సాంగంగా, పరమేశ్వరిని ఆరాధించినవాళ్ళకు కీర్తిప్రతిష్టలు, సంపదలు, సమృద్ధి, ప్రజ్ఞ, వైరాగ్యం, ధర్మం అనే ఆరు గుణాలు అలవడుతాయి. ఆ పరమేశ్వరి తత్త్వాన్ని అర్థం చేసుకునేందుకు చతుర్వింశతి (24) తత్వాలే సోపానాలు. పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) పంచ తన్మాత్రలు (శబ్దం, స్పర్శ, రూపం, రసం గంధం) పంచేంద్రియాల జంటలు (కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు) మనస్సు, బుద్ధి, అహంకారం, మహత్తు, వీటిద్వారా ఆ తల్లిని తెలుసుకోవాలి. వీటిలో, వీటికి అతీతంగా ఉండే పర్మేశ్వరి తత్త్వాసన, తత్త్వ సింహాసనంపై ఆసీనురాలైన తత్వాసనిని చూడగలిగిన తాత్వికుడు, ఆ తల్లికి తన అంతరంగాన్ని చెప్పుకుంటాడు. ప్రపంచంలో ప్రతి పదార్థంలో ఎదో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి మూలం పరాశక్తి. పరమేశ్వరిలోని అపరిమేయమైన పరాశక్తి అన్ని పదార్థాలలో వేర్వేరుగా ప్రతిఫలిస్తుంటుంది. ఆమెను మించిన శక్తిలేదు. శక్తిని ఆమె అనుగ్రహం వల్లనే సాధించుకోవలసి ఉంటుంది. అందుకు అచంచలమైన దీక్ష కావాలి. ఉత్కృష్టమైన నిష్ట కావాలి. ఆమె శక్తికే కాదు, జ్ఞానానికి కూడ పరాకాష్ఠ. ఈ సమస్త విశ్వంలోని ప్రజ్ఞా విశేషాలన్నీ అవ్యక్తదశలో పరావాక్కులో ఒదిగి ఉంటాయి. ఆ పరావాక్కే పరాశక్తి. ఘనీభవించిన జ్ఞానమే కరిగి వాగ్రూపంలో ప్రవహిస్తుంది. అనంతమైన జ్ఞానం అమెలో ఇమిడి ఉన్నందువల్ల ఆమె జ్ఞానానందంలో తేలిపోతుంటుంది. ఆమె పేరు చెబితేనే మాంగల్యం ఫలిస్తుంది. మంగళ ధ్వనులు వినిపిస్తాయి. ఆమెను దర్శించుకున్న ప్రతి బిందువు మహా సింధువులా పొంగిపోతుంది. ఆమె చరిత్రను తెలుసుకున్నవారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. ఆమె సాయుజ్యమే అఖండమైన సామ్రాజ్యం. ఆ తల్లి కటాక్షవీక్షణం ప్రసరిస్తేచాలు, సమస్త ఐశ్వర్యాలు మన ముందుకొచ్చి పడతాయి. అన్యులను కూడ ధన్యులను చేసే కరుణామయి. అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే కారుణ్యమూర్తి ఆ తల్లి. ఆ తల్లిని నిత్యం ప్రార్థించుకుంటే సమస్తశుభాలు కలుగుతాయి అన్ని విధాలైన కష్టాలు తొలగిపోతాయి.
మనలోని శక్తి ఆ పరాశక్తే!
56
previous post