మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే కార్తీక శుక్లపక్ష ద్వాదశి. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మథించిన రోజు ఇది. అందుకే దీన్ని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అన్నారు. మథించడం అంటే చిలకడం. కాబట్టి ‘చిలుకు ద్వాదశి’గా కూడా వ్యవహరిస్తారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపావళి రోజు వలె లక్ష్మీదేవిని నాణాలతో పూజిస్తే శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఎల్లవేళలా క్షీర సాగరంలో శేషశయ్యపై శయనించి ఉండే విష్ణుమూర్తి ఈ రోజు బ్రహ్మాది దేవతలతో బృందావానికి వస్తాడని, అందువల్ల బృం దావనంలో ఎవరు శ్రద్ధాసక్తులతో విష్ణుపూజ చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, సిరిసంపద లు సిద్ధిస్తాయని పురాణ కథనం. పలు విశేషాల సమాహారం అయిన క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. అత్యంత పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, అలాగే యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. స్వాయంభువ మన్వాది సంవత్సరాలను క్షీరాబ్ది ద్వాదశి రోజు నుంచి లెక్కిస్తారు. ఏకా దశి నుంచి పూర్ణిమ వరకూ ‘భీష్మ పంచక వ్రతం’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరణశ య్యపై ఉన్న పితామహుడు భీష్ముని దాహార్తి తీర్చడానికి అర్జునుడు తన బాణంతో పాతాళ గంగను పైకి రప్పించినది ఈ రోజునేనని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని ‘బృందావని ద్వాదశి’గా పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు పాల సముద్రంలో మహాలక్ష్మి ఆవిర్భవించిందనీ, ఆ రోజు నే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందనీ ‘చతుర్వర్గ చింతామణి’ అనే గ్రంథం చెబుతోం ది. అందుకే ఈ రోజు లక్ష్మీ నారాయణ కల్యాణం నిర్వహంచే సంప్రదాయం ఏర్పడింది. విష్ణుమూర్తినీ, మహాలక్ష్మినీ బృందావనానికి బ్రహ్మ తీసుకొని వెళ్ళి, అక్కడ తులసితో విష్ణువుకు వివాహం జరిపించాడని క్షీరాబ్ది వ్రత కథ చెబుతోంది. లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయ మాడిన శుభ తిథి కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయం త్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీని శ్రీలక్ష్మిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నా రాయణునిగాను భావించి వివా హం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం, ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహార మౌతుంది. పరమ పవిత్రమైన ఈ రోజును పావన ద్వాదశిగా, విభూతి ద్వాదశిగా, గోవత్స ద్వాదశి గా, నీరాజన ద్వాదశిగా వ్యవహరిస్తూ అందుకు సంబంధించిన వ్రతాలు చేస్తుంటారు. తులసి సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశే.ముఖ్యంగా, మథురలోని బృందావనంలో, మహారాష్ట్రలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీ కల్యాణం నిర్వహస్తారు. తెలుగు లోగిళ్ళలో క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసికోట దగ్గర అలికి, ముగ్గు లు పెడతారు. తులసికోటనే బృందావనంగా భావించి, ఉసిరిక కొమ్మను విష్ణుమూర్తికి ప్రతీ కగా భావించి తులసీ కల్యాణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గృహణి లేదా దంపతులు నిర్వహస్తారు. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఇలా ఎన్నో రకాల తులసి చెట్లు ఉన్నాయి. నల్లని కాండం ఉన్న మొక్కను ‘కృష్ణ తులసి’ అనీ, తెల్లని కాండం ఉండే మొక్కను ‘లక్ష్మీ తులసి’ అనీ అంటారు. ఈ రెండు వర్ణాల తులసి వృక్షాలను తులసికోటలో నాటి, పరి ణయం జరిపిస్తారు.
దశావతారాల్లో ఎనిమిదవది శ్రీకృష్ణావతారం. తులసి సన్నిధిలో ఉండడం తనకెంతో ఇష్టమని సాక్షాత్తూ కృష్ణుడే తన సహపాఠి ఉద్ధవునితో చెప్పినట్టు పురాణాలు పేర్కొంటున్నా యి. తులసితో కృష్ణునికి ఉన్న అనుబంధమే తులసీ కల్యాణం నిర్వహంచడానికి ముఖ్య కార ణం. ఈ కల్యాణం సందర్భంగా తులసిని షోడశోప చారాలతో పూజించి, వివిధ రకాల పండ్లు, చెరుకు ముక్కలు, చలిమిడి, వడపప్పు నివేదించి, హారతి ఇస్తారు. ముత్తైదువను శ్రీ మహాలక్ష్మిగా సంభావించి, పసుపు కుంకుమలు, ఫల పుష్ప తాంబూలాదులతో సత్కరించి, దీవెనలు పొందుతారు. అలా చేస్తే మాంగల్యాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. రోజంతా ఉపవసించిన గృహణులు పూజానంతరం తులసికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసు కొని, ఉపవాసాన్ని విరమిస్తారు. ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో దేవుని ముందు దీపాలు వెలిగించడం మన సంస్కృతి లో భాగం. అలా పెట్టలేనివారు కార్తీక మాసంలోనైనా పెట్టాలని శాస్త్రాలు అంటున్నాయి. అది కూడా చేయలేనివారు ద్వాదశినాడు 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే, సంవత్స రమంతా దీపం వెలిగించినట్టవుతుందని శాస్త్ర వచనం. కార్తికమాసం అంతా దీపాలు పెట్టలేని వారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ నాడు తప్పకుండా పెట్టాలనీ, అందునా ద్వాదశి నాటి దీపం వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందనీ ‘కార్తిక పురాణం’ చెబుతోంది. హందూ సంస్కృతిలో తులసి అతి పవిత్రం. తులసీ కృష్ణుల అనుబంధం కూడా అటు వంటిదే. తులసికోట లేని ఇల్లంటూ ఉండదు. మహళలు తులసిని ప్రతిరోజూ పూజిస్తారు. తులసికి నీరు పోసి, దీపం పెట్టి, తులసీ స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేసి, చివరగా తులసికోట లోని తీర్థాన్నీ, తులసీ దళాన్నీ స్వీకరిస్తారు. తులసిని పూజించడం అంటే లక్ష్మిని ఆరాధించడ మే. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ లక్ష్మీ నారాయణులకు చేసే పూజ. ఎంతో ప్రాధా న్యం ఉన్న ఈ ఆరాధన ప్రేమకూ, భక్తికీ, ప్రతీక. తులసి తీర్థం, తులసీ దళం మీదుగా వచ్చే గాలి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తులసిలో రోగనివారక శక్తి ఉందని ఆయుర్వేదం నిరూపించింది. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణ లిఖితం. ‘గోవత్స ద్వాదశి’గా పిలిచే ఈ రోజున వత్సంతో అంటే దూడతో కూడిన ఆవును దానం ఇస్తే విశేష ఫలం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం.
Read Also..
Read Also..