స్విమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులను వేధించవద్దని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టిటిడి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి నేతృత్వంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, జనరల్ మేనేజర్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రభావతిలతో సంయుక్తంగా చర్చలు జరిపారు. కార్మికులను ఇష్టం వచ్చిన రీతిలో తొలగిస్తున్నారని, చిన్న, చిన్న కారణాలతో ఇబ్బందులు పెడుతున్నారని సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారని లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్ లో చేరిన తర్వాత తమను మరిన్ని ఇబ్బందులకు గురి చేయడం న్యాయం కాదని కార్మికులు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యానికి వివరించారు. కార్పొరేషన్ కార్మికులను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పని వేళలు నిర్దేశించడంలో స్పష్టత లేదని తెలిపారు. సెలవుల కేటాయింపులు సూపర్వైజర్లకు సంబంధం లేకుండా అధికార యంత్రాంగమే ఓ విధానాన్ని నిర్ణయించాలని కోరారు. దానికి స్విమ్స్ యాజమాన్యం అంగీకరించింది. సెలవులు ఇచ్చే విషయంలో కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా, సూపర్వైజర్లకు సంబంధం లేకుండా తామే ఓ విధానాన్ని నిర్ణయిస్తామని అంగీకరించారు. వేతనాలు పెంపుదలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, కొన్ని విధాన నిర్ణయాలు తర్వాతే వేతనాల పెంపుదలను ప్రకటిస్తామని తెలిపారు. డాక్టర్లు, నర్సులకు లాగే వర్కర్లకు పని విధానాన్ని, పని గంటలను నిర్ణయిస్తామని, రాత్రి డ్యూటీలలో మూడు గంటల విశ్రాంతికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. తొలగించిన కార్మికులందరినీ పనిలోకి తీసుకుంటామని తెలిపారు. గతంలో జరిగిన ఇబ్బందులను సరి చేస్తామని రానున్న రోజుల్లో ఎలాంటి వేధింపులు ఉండవని కార్మికులు యాజమాన్యానికి సహకరించాలని డాక్టర్ రామ్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మిక నాయకులు, కార్మికులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలతో పాటు స్విమ్స్ కార్మికుల యూనియన్ నేతలు రవి, ముత్తు, సూరి, కోటయ్య తదితరులతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్విమ్స్ లో కార్మికులను వేధించవద్దు… సిఐటియు
66
previous post