పూర్వం దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు. ఆహ్వానం ఉండకపోయినప్పటికీ శివుని సతి పార్వతీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యాజ్ఞానికి వెళ్లగా అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించరు. అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన పార్వతీ అప్పటికప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలింది. అది తెలిసిన శివుడు సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించడం మొదలుపెడతాడు. లోక రక్షణ కోసం శివుడిని యథాస్థితికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తారు. ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి. కాలాంతరంలో 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి. వాటినే అష్టాదశ పీఠాలు అంటారు. అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు కానీ ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి నట్లుంటుంది. దానికింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి. కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు. అలాగే ఈ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఈ త్రివేణీ సంగమంనుంచి మాత్రమే ఇంటికి తీసుకు వెళ్ళాలి. ఇక్కడివారు శ్రీ మాధవేశ్వరీ దేవి అలోపీ దేవిగా వ్యవహరిస్తారు. అలా పిలవడానికి ఓ కథ ప్రచారంలో వుంది. పూర్వం ఒకప్పుడు ప్రయాగ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయం చేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. అప్పటి నుంచి ఆ దేవిని అలోపీ దేవి గా వ్యవహరిస్తున్నారు. అలోపీ అంటే మాయమవటం అని అర్ధం. అప్పటి నుంచి అక్కడివారు పెళ్ళిళ్లకు ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు.
Read Also..
Read Also..