స్కాంద పురాణంలో..బ్రహ్మ ఖండంలో.. రామేశ్వర క్షేత్రంలో 24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించబడింది. అవి.. చక్ర తీర్ధం, భేతాళ వరద తీర్ధం, పాప వినాశనం, సీతా సరస్సు, మంగళ తీర్ధం, అమృత వాపిక, బ్రహ్మ కుండము, హనుమత్కుండం, అగస్త్య తీర్ధం, రామ తీర్ధం, లక్ష్మణ తీర్ధం, జటా తీర్ధం, లక్ష్మీ తీర్ధం, అగ్ని తీర్ధం, శివ తీర్ధం, శంఖ తీర్ధం, యమునా తీర్ధం, గంగా తీర్ధం, గయా తీర్ధం, కోటి తీర్ధం, స్వాధ్యామృత తీర్ధం. సర్వ తీర్ధం, ధనుష్కోటి తీర్ధం, మానస తీర్ధం. రావణాసురుని చంపిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివలింగ ప్రతిష్టాపనను రామేశ్వరంలో చేయ సంకల్పించాడు. సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన “పుల్ల” గ్రామానికి దగ్గరలో, సేతువుకు సమీపంలో, గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని శ్రీరాముడి సంకల్పం. హనుమంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహంతో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు. ముహూర్త విషయాన్ని కూడా తెలిపి, ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. హనుమంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించి పోతుండగా, మహర్షుల అనుమతితో సీతాదేవి ఇసుకతో శివ లింగాన్ని చేస్తే, సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామచంద్రుడు’. ఆ లింగానికి అభిషేకం జరిపి, పూజ కూడా చేసేశాడు. మారుతి శివలింగాన్ని తీసుకొని వచ్చాడు. విషయం తెలిసి బాధపడి తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు. దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టించమని చెప్పాడు. హనుమకు కోపం వచ్చి “రామా! నన్ను అవమానిస్తావా? సైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు? ఇంకో చోట ప్రతిష్ట చేయటం కోసమా నేను అంత దూరం వెళ్లి నాకీ జీవితం వద్దు. నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను” అని దూకబోతుండగా రాముడు వారించాడు” హనుమన్నా! మనిషి తను చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఆత్మను చూడు. దుఖం పొందటం వివేకికి తగనిపని. దోషాన్ని వదిలి మంచిని గ్రహించు. నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్థాపిద్దాం. ఈ రెండు లింగాలను దర్శించినా, స్మరించినా, పూజించినా పునర్జన్మ ఉండదు. భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివలింగాన్ని పూజించి, ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు. అలా కాకపోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రంలో విసిరెయ్యి” అన్నాడు. అప్పుడు హనుమ తన తోకను ఇసుకలింగం చుట్టూ బిగించి పెకలించటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అది ఇసుమంత కూడా కదలలేదు. హనుమ తన వివేకంతో ఆలోచించి తన తప్పిదాన్ని తెల్సుకుని సీతారాములకు ప్రణమిల్లాడు. అప్పుడు సీతారాములు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని ప్రతిష్టించారు. హనుమ సైకతలింగం పెకలిస్తూ క్రింద పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది. అదే “హనుమత్కుండం”. ఇది రామేశ్వరానికి కొద్దిదూరంలో ఉంది. దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతా రాములు అనుగ్రహించారు.
Read Also..