కృతయుగములో బ్రహ్మ సృష్టి చేసెను. వారెల్లరు తపస్సులు జ్ఞాన విశారదులైరి. అందరూ పరమాత్మ ధ్యానంలో యుండుట వలన సృష్టి జరుగుట లేదు. ప్రజలలో అనురాగ విద్వేషాలు లేవు. ప్రాణిజాలమునకు సంసార సుముఖత కలిగించుటకు అవిద్య లేక మాయను సృష్టించుటకు బ్రహ్మ తీవ్రంగా ఆలోచిస్తూ, ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడి నొంది, తాను సృష్టించిన అవిద్య వలన స్మృతిని కోల్పోయి, వేదములను మరచిపోవుట వలన రేణుకాదేవిని ఆరాధించగా, ఆమె ప్రత్యక్షమై, దత్తాత్రేయుని ఆశీస్సులు పొందమని చెప్పి, సహ్యాద్రిపై ఉన్న దత్తాత్రేయుని చూపించగా, బ్రహ్మ అనఘాదేవి సమేత దత్తాత్రేయుని దర్శించి, అన్నింటినీ మరిచానని, పూర్వ స్మృతిని ప్రసాదించమని కోరగా, రేణుకాదేవియే వేదమాత, ఆహ్లాదిని, జ్ఞానయోగి, గాయత్రి… అని తెలిపి, నీవు విస్మరించినదంతయు స్ఫురణకు వచ్చునని దత్త ప్రభువు చెప్పెను. అంతట అనఘాదేవి నుండి వేదములు రేణుకాదేవిని చేరినవి. పిమ్మట రేణుకాదేవిని, అనఘాదేవిని బ్రహ్మ ప్రార్థించగా, మరిచిన వేదములు, గాయత్రీ మంత్రం స్ఫురణకు వచ్చెను. ఈ విధంగా బ్రహ్మకు దత్త ప్రభువు గురువై భాసిల్లెను. దత్తాత్రేయ స్వామి తనని దర్శించగోరువారిని అనేక విధాలుగా పరీక్షించేవారు. భయబ్రాంతులు గొలిపెడివారు. బాలోన్మత్త పిశాచ రూపములలో సంచరించేవారు. అంగనతో కూడి యుండి మద్యం సేవిస్తున్నట్లు కన్పించి, తన దరి చేరేవారిని పరీక్షించేవారు. ఒకపరి దత్తాత్రేయ స్వామి ఏకాంత నిష్టలో తపస్సు చేయుటకై వెళ్ళుచుండగా, ముని కుమారులు వారి వెంటపడగా, దత్త ప్రభువు ఒక మడుగులో దిగి అదృశ్యుడయ్యెను. ముని కుమారులు చాలాకాలం ఆ మడుగు వద్దే వేచియుండిరి. దత్తుడు వందేళ్లు తర్వాత వారిని పరీక్షించుటకై, ఒక అంగనతో కలసి నీటి నుండి బయటకు వచ్చి, ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకొనగా, అది చూసి కూడా ముని కుమారులు కదలలేదు. అప్పుడు దత్తుడు మద్యం సేవిస్తూ, ఆమెతో సరసములాడుచు కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో, కొందరు మునికుమారులు ఇతను దురాచారపరుడు, స్త్రీలోలుడు అని భావించి, దత్తుని విడిచి వెడలిరి. ఇది దత్తలీల అని గ్రహించి నిలిచిన వారికి తన నిజ స్వరూపం చూపించి అనుగ్రహించారు.
Read Also..