మల్దకల్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినది. ఇది డివిజన్ కేంద్రమైన గద్వాల నుంచి రాయిచూరు వెళ్ళు మార్గములో గద్వాల నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్వయం భూస్వామి దేవాలయం స్థానిక పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రతియేటా ఈ దేవాలయానికి రథోత్సవం మరియు జాతర అతి వైభవంగా జరుగుతుంది. ద్వాపరయుగాంతం కలియుగ ఆరంభంలో తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో దీనికి ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలోని నాలుగవ అధ్యాయంలో ఆధారాలున్నాయి. ఈ గ్రామంలో ఎవరు కూడా ఇండ్లను రెండో అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇళ్ళు ఉండరాదని, ఇదివరకు ఈ విధంగా చేసినవారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది. ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మొదలకల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆది శిలా క్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా ‘ఆది’ అని, కల్లు అనగా ‘రాయి’ అని అర్థము. బ్రహ్మ దేవుడు ఒక శిలను సృష్టించి ‘ఆదిశిల’ అని పేరు పెట్టాడని, అక్కడే పరమ శివుడు తపస్సు నాచరించాడని, అట్టి శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయన మూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు, ఒకే శిలపై ఉద్భవించారు. క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసి యున్నాడు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది. ఒక రోజు గద్వాల సంస్థానాధీశుడు అయిన నలసోమనాద్రి రాజు గుర్రము పైన వేటకై మల్దకల్ ప్రాంతానికి రాగా ఒక చోట అతని గుర్రము అకస్మాత్తుగా ఆగిపోగా, రాజు ఈ ప్రాంతములో ఏదో మహాత్యము ఉందని భావించి, దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదలలో కల విగ్రహాన్ని చూపాడు. నా గుర్రం పరిగెత్తితే నీకు గుడి కట్టిస్తానని మొక్కి తన గుర్రం ఎక్కగానే అది రెట్టించిన వేగంతో పరిగెత్తి తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర చెబుతుంది. అప్పుడు రాజు గారు దేవాలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, అడవిలో విగ్రహాన్ని చూపిన పశువుల కాపరి అయిన బోయవాడిని పూజారిగా నియమించాడు. నేటికీ ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తుంటారు. స్థానికులు దేవాలయంలోని భగవంతుణ్ణి మల్డకల్ తిమ్మప్ప దేవునిగా పిలుస్తుంటారు. ఈయన చుట్టుప్రక్కల గ్రామాలలో ఫెమస్. ప్రతి ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి నాడు భక్తులు ఆనందోత్సాహాల మధ్య జాతర ( తిరునాళ్ల) జరుపుకుంటారు. కర్నాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఏటా 20 లక్షల మంది పైగా దేవాలయాన్ని దర్శిస్తుంటారని అంచనా.
Read Also..
Real Also..