తమ సుదీర్ఘ ప్రస్థానంలో వ్యక్తులు చేసిన సేవలకు, సాధించిన విజయాలకు గుర్తింపుగా వారిని బిరుదులతో , సత్కారాలతో గౌరవించడం సమాజ బాధ్యత . ప్రఖ్యాత నటులు, నిర్మాత, రియల్టర్, రాజకీయ నాయకులు అయిన మురళీమోహన్ కు ఇటీవల అలాంటి అరుదైన గౌరవం దక్కింది . 50 వసంతాల చలనచిత్ర జీవిత ప్రస్థాన విజయాలను పురస్కరించుకుని ఆయనను ఇటీవల గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది కేఎల్ యూనివర్సిటీ .గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కేఎల్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలను గౌరవ డాక్టరేట్స్ తో సత్కరించింది కేఎల్ యూనివర్సిటీ.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించిన మురళీమోహన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ” కేఎల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుండి ఈ గౌరవ డాక్టరేట్ స్వీకరించటం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గతంలో ఐదు లక్షలు ఇస్తే గౌరవ డాక్టరేట్ ఇస్తామని చాలామంది నన్ను ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించారు. కానీ డబ్బులు ఇచ్చి తెచ్చుకునే
డాక్టరేట్లు, అవార్డులు నాకు అక్కర్లేదని తిరస్కరించాను. కానీ ఇప్పుడు కే.ఎల్. యూనివర్సిటీ వారు ఇచ్చిన ఈ డాక్టరేట్ ను ఇన్నేళ్ల నా ప్రస్థానానికి వచ్చిన గుర్తింపుగా, గౌరవంగా భావిస్తున్నాను. ప్రస్తుతం నా చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్న తరుణంలోనే నాకు డాక్టరేట్ రావటం చాలా గర్వంగా, ఆనందంగా అనిపిస్తుంది. అలాగే తమ జీవితం మొత్తాన్ని శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు అంకితం చేసిన ప్రముఖ సైంటిస్టులు డాక్టర్ ఖురేషి అబ్దుల్, భారతరత్న డాక్టర్ సి ఎన్ ఆర్ రావు, డాక్టర్ జి ఎస్ కులకర్ణి వంటి ప్రముఖులతో డయాస్ షేర్ చేసుకుంటూ వారితోపాటు గౌరవ డాక్టర్ అందుకోవటం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా,
కనుల పండువగా నిర్వహించిన కే.ల్. యూనివర్సిటీ ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ గారికి, వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు.
ఈ గౌరవ డాక్టరేట్ సమాజంలో నా గౌరవాన్ని ఇనుమడింపజేయటమే కాకుండా సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచిందని భావిస్తూ ఆ మేరకు కళా , సేవా రంగాలకు ద్విగుణీకృత ఉత్సాహంతో పునరంకితం అవుతానని హామీ ఇస్తున్నాను” అన్నారు మురళీమోహన్.
Read Also..