చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయులు మెరుగుపడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ముకణాల్లో వాపును అదుపుచేయటానికీ తోడ్పడుతున్నట్టూ బయటపడింది. రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒకొకరికి 10 గ్రాముల మామిడి తాండ్రను (ఇది 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం) తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. ”అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి” అని అధ్యయన నేత డాక్టర్ లూకాస్ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు. మరోవైపు- మామిడిలోని పాలీఫెనాల్స్ రొమ్ముల్లోని క్యాన్సర్, క్యాన్సర్ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపుచేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో బయట పడింది.
Read Also..
Read Also..