చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశానికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. ప్రపంచదేశాలు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అందరూ చాలా ఉత్సుకత ప్రదర్శించారు. ఈ ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో అక్కడి ఉపరితలంపై దాదాపు 2.06 టన్నుల దుమ్ము గాల్లోకి లేచింది. మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయని హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టులు గుర్తించారు. చంద్రుడి కక్షలోనే తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని విశ్లేషించారు. ల్యాండింగ్‌కు కొన్ని గంటల సమయం ముందు, ఆ తర్వాత తీసిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. డిసెంట్ స్టేజ్ రాకెట్ల ప్రజ్వలన ప్రక్రియ కారణంగా భారీగా దుమ్ము పైకి లేచినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. కాగా.. దుమ్ము భారీగా ఎగిసిపడిన ప్రభావంతో ఆ ప్రాంతం ప్రకాశవంతంగా మారింది. ఇలా జరగడాన్ని ‘ఎజెక్టా హాలో’ అని అంటారు. దాదాపు 108.4 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిణామాల సమయంలో చంద్రుడి దుమ్ము ప్రతిస్పందన తీరును తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.
చంద్రుడిపై విక్రమ్ లాండింగ్ తో గాల్లోకి ఎగిసిన దుమ్ము
111
previous post