ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోమారు నిజమనినిరూపణ అయింది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్‌వెబ్‌లో వెలువడిన ఒక ప్రకటన ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై ఐసీఎంఆర్ నుంచి ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 81.5 కోట్ల మంది ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారం ఉన్నట్టు ఓ అజ్ఞాత వ్యక్తి డార్క్‌వెబ్‌లో ప్రకటించాడు. దీనికి సంబంధించి కొన్ని పేర్లు, వారి ఫోన్ నంబర్లు, అడ్రస్‌లతో సహా వెల్లడించాడు. ఈ వివరాలు ఐసీఎంఆర్ వద్దనున్న డాటాతో సరిపోలినట్టు అధికారులు పేర్కొన్నారు. ఐసీఎంఆర్ మీద గత ఫిబ్రవరి నుంచే సైబర్ దాడులు జరుగుతున్నాయి. గత ఎనిమిది నెలల్లో సుమారు ఆరువేల సార్లు ఐసీఎంఆర్ సర్వర్లపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. దీనిపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర సంస్థలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, అక్కడి నుంచే డాటా చోరీ జరిగిందని అభిజ్ఞ వర్గాలు పేర్కొన్నాయి. డాటా చోరీ విషయం తెలిసిన వెంటనే వివిధ ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డాటా చోరీలో విదేశీ వ్యక్తుల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మరింత నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు.
Read Also,,
Read Also..