గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ సిబ్బందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పును షాకింగ్ పరిణామంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. కోర్టు ప్రొసీడింగ్స్ గోప్యతకు సంబంధించిన అంశం కావడంతో ఈ తీర్పుపై ఇంతకుమించి వ్యాఖ్యానించబోమని స్పష్టం చేసింది. అయితే తీర్పును వ్యతిరేకించబోతున్నామని హామీ ఇచ్చింది. మరణశిక్ష పడినవారు గతంలో ప్రధాన భారత యుద్ధ నౌకలకు కమాండింగ్ చేశారని భారత్ ప్రస్తావించింది. రిటైర్మెంట్ తర్వాత దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారని, ఖతార్ సాయుధ బలగాలకు శిక్షణ, సంబంధిత సేవలు అందిస్తున్నారని పేర్కొంది. వారిలో కొందరు అత్యంత సున్నితమైన ఇటాలియన్ టెక్నాలజీ ఆధారిత జలాంతర్గాములలో పనిచేస్తున్నారని, ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని పేర్కొంది. తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని, కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో మాట్లాడుతున్నామని వెల్లడించింది. మరణశిక్ష నుంచి వారిని తప్పించేందుకు అవకాశమున్న అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అన్ని దౌత్య, చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని తెలిపింది.
భారత మాజీ నౌకాదళ సిబ్బందికి మరణశిక్ష..
59
previous post