దక్షిణ చైనా సముద్రంపై తమ యుద్ధ విమానానికి అత్యంత సమీపంలో చైనా ఫైటర్ జెట్ దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం వెల్లడించింది. చైనా పైలట్ చర్య ప్రమాదకరంగా ఉందని దుయ్యబట్టింది. అమెరికా వాయుసేనకు చెందిన బి-52 బాంబర్‌కు చాలా దగ్గరగా ప్రయాణించిందని ఆగ్రరాజ్యం మండిపడింది. మా విమానానికి 10 అడుగుల దూరంలోకి నియంత్రణ లేకుండా వేగంగా దూసుకొచ్చింది. బి-52కు ముందువైపునకు, కింది భాగంలోకి వచ్చింది. ఈ చర్య రెండు విమానాలను ప్రమాదపు అంచుల్లోకి నెట్టింది. విమానాన్ని ఢీకొట్టేంత దగ్గరగా వచ్చిన విషయం చైనా పైలట్‌కు తెలియకపోవడం ఆందోళనకరం ఉందని అమెరికా సైన్యం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే అమెరికా బాంబర్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని…అందుకే దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తోందని వ్యాఖ్యానించింది.