ఇటీవల చోటు చేసుకుంటున్న దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు అందరూ అండగా ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండి మరియు వైస్ చైర్మన్ సిహెచ్ ద్వారకాతిరుమలరావు పిలుపునిచ్చారు. నూజివీడు ఆర్టీసీ డిపోకు విచ్చేసిన సందర్భంగా కార్మికులు సిబ్బందితో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సింగు అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో కొందరు దాడి చేయడం తో గాయపడిన బాధిత డ్రైవర్ను సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనలో వెంటనే స్పందించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనేక ప్రాంతాలలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దురుసుగా ప్రవర్తించడం, దాడులు చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ఖండించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి, రక్షించాలని సూచించారు. నూజివీడు ఆర్టీసీ డిపోలో గతంతో పోలిస్తే అనేక మెరుగైన ఫలితాలతో పాటు, ఎన్నో అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని అభినందనలు తెలియజేశారు. ఎక్కడా లేనివిధంగా స్థానికంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఇరువైపులా పచ్చని చెట్లను పెంచి, సంరక్షించడం ప్రశంసనీయమన్నారు. ఇందుకోసం కండక్టర్ ప్రభు తన వేతనం నుండి నగదు వెచ్చించి మొక్కల సంరక్షణ బాధ్యత గా చేపట్టటం ఆదర్శనీయమన్నారు. డిపో నుండి దసరా, సంక్రాంతి పర్వ దినోత్సవాలతో పాటు పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం వలన ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందుతున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసే ప్రత్యేక సర్వీసులు, ఆర్టీసీ నుండి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో భక్తుల సౌకర్యం అందుబాటులోకి బస్సు సర్వీసులను తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ఇటీవల వినూత్న రీతిలో ఏపీఎస్ఆర్టీసీ చేపట్టిన కార్గో సేవలు ఎంతో విస్తృతమైన ప్రజాధరణ పొందుతున్నట్లు చెప్పారు. మరింతగా కార్గో సేవలను అందిస్తూ ప్రజలు, వ్యాపారస్తుల ఆదరాభిమానాలు పొందేందుకు ప్రణాళికలతో ముందడుగు వేయనున్నట్లు వివరించారు. అన్ని ప్రాంతాలలోని ఆర్టీసీ డిపోలు, బస్టాండుల పరిశీలన అనంతరం ఆధ్యాత్మిక వసతుల కల్పనకు, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రణాళికలు అమలు చేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also..