తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వరి పంట అధికంగా నీట మునిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు.
తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుగా జిల్లాలో పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుపాను ప్రభావం ఉన్నప్పటికీ జిల్లాలో భారీ నష్టం జరగకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు. 25 మండలాలలో వర్షం కురిసిందని, 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కేవలం రెండోచోట్ల చిన్న ప్రమాదాలు జరిగాయని, రెండు గోడలు కూలి నాలుగు గొర్రెలు చనిపోయాయన్నారు. 32 ఇళ్లు దెబ్బ తిన్నాయని, 37 గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. 350 స్తంభాలు పడిపోయాయని, రాత్రి రెండున్నర గంటల వరకు విద్యుత్ శాఖ అధికారులు రోడ్లమీదనే ఉండి విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 90 శాతంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. పర్చూరు సబ్ స్టేషన్ దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పనులు జరుగుతున్నాయన్నారు. అధికంగా సూర్యలంక, ఓడరేవు ప్రాంతాలలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
జిల్లాలో 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 1,319 మందికి ఆశ్రయం కల్పించామని కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు.
2,500 మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నామని, బుధవారం సాయంత్రానికి వారిని ఇళ్లకు పంపుతామన్నారు. పునరావాస కేంద్రాల నుంచి వెళ్తున్న వారికి ప్రభుత్వం నిర్దేశించినట్లు ఐదు వస్తువులు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. 70 వేల హెక్టార్లలో ధాన్యం నీట మునిగిందని, పొలాల్లో నీరు నిల్వ లేకుండా దిగువకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా ఈ పనులు చేపట్టామన్నారు. ప్రతి మండలానికి ప్రోక్లైన్లు, జెసిబి యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించామని, రూ. 25 లక్షలు నిధులు ఇచ్చామన్నారు. బాపట్లలో అధికంగా పండే ధాన్యం, శనగ, అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటల నష్టం అంచనాల సర్వే పనులు మొదలయ్యాయన్నారు. కారంచేడు, మార్టూరు, పర్చూరు మండలాలలో పంట కాలువల ద్వారా రహదారులకు అంతరాయం ఏర్పడగా వాటిని పునరుద్ధరించామన్నారు. తీర ప్రాంతంలో వలలు, బోట్లు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే 93 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. గేదెలకు అంటూ వ్యాధులు రాకుండా టీకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు.తుపాను నష్టంపై మూడు రోజుల్లో అంచనాల సర్వే పూర్తి చేసి నివేదిక పంపుతామన్నారు.