కరీంనగర్ ఎంసీహెచ్ (Karimnagar MCH) కిడ్నాప్ ఘటన:
కరీంనగర్ ఎంసీహెచ్ నుండి పసికందు కిడ్నాప్ ఘటనను 24 గంటలు గడవకముందే ట్రేస్ చేసేశారు. మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు ఎట్టకేలకు కిడ్నాపర్ తో పాటు పసికందును పెద్దపల్లి జిల్లాలో పట్టుకున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఆదివారం మద్యాహ్నం ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కొద్ది సేపటి క్రితం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో పట్టుకుని బిడ్డను ఎంసీహెచ్ లో ఉన్న తల్లి చెంతకు చేర్చారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ నేతృత్వంలో కరీంనగర్ 2 టౌన్, జమ్మికుంట, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్ట్ టీమ్స్ కిడ్నాప్ గుట్టును రట్టు చేశాయి. అయితే బాధిత కుటుంబానికి చెందిన పదేళ్ల బాలున్ని మచ్చిక చేసుకున్న మహిళా కిడ్నాపర్ ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా బాలుడిని తన వెంట తిప్పుకుని ఆసుపత్రి ఆవరణలోనే కొద్ది సేపు సంచరించిన కిడ్నాపర్ ఆ తరువాత బస్ స్టేషన్ కు చేరుకుని అక్కడి నుండి జమ్మికుంటకు వెళ్లింది.
కరీంనగర్ పోలీసులు(Karimnagar police) జమ్మికుంట సీఐని అప్రమత్తం చేయడంతో పట్టణంలోని సీసీ ఫుటేజీతో పాటు ఆర్టీసీ బస్ కండక్టర్ ను కూడా ఆరా తీశారు. అనంతరం బాధితులు బీహార్ కు చెందిన వారు కాబట్టి ట్రైన్ ఎక్కేందుకు రైల్వై స్టేషన్ కు వెల్లి ఉంటుందా అన్న కోణంలో ఆరా తీస్తూనే జమ్మికుంట నుండి ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గం గుండా వెల్లే రహదారులపై కూడా పోలీసులు ఓ కన్నేశారు. వారి అనుమానానికి తగ్గట్టుగానే కిడ్నాపర్ జమ్మికుంట నుండి కాల్వశ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని ఓ గ్రామానికి చేరుకుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న పోలీసు బృందాలు పసికందును బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పట్టుకున్నారు.
కొద్ది సేపటి క్రితం మూడు రోజుల పసికందును క్షేమంగా కరీంనగర్ కు తరలించిన పోలీసు అధికారులు తల్లికి అప్పగించారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నిందితురాలికి బాధిత కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా నిర్దారించినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలను రాబట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నం అయ్యారు. మరికొద్ది సేపట్లో ఈ కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర వివరాలు అందించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.