సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”. ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి “వధువు” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా “వధువు” వెబ్ సిరీస్ హైలైట్స్, ఇందులో నటించిన ఎక్సీపిరియన్స్ తెలిపింది అవికా గోర్.
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఇటీవల మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించాను. అదే టైమ్ లో “వధువు” ప్రాజెక్ట్ గురించి చెప్పారు. బెంగాలీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఇందును తెలుగులోకి “వధువు”గా తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నేను గతంలో చేసిన బబ్లీనెస్ ఈ క్యారెక్టర్ లో ఉండదు. ఒక యూనిక్ క్యారెక్టర్ దొరికింది.
“వధువు” వెబ్ సిరీస్ లో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయా అని అందరూ అడుగుతున్నారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉండవు. థ్రిల్లర్ జానర్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మీరు ట్రైలర్ లో చూసినట్లు మిస్టరీ సన్నివేశాలు ఉంటాయి. టీవీలో సీరియల్స్ చేసిన అనుభవం నాకు ఉంది. టీవీ ఆడియెన్స్ కు ఎలాంటి కంటెంట్ ఇష్టమో..అది “వధువు” లో ఉంటుంది. ఇప్పటిదాకా ఓటీటీ చూడకుండా టీవీ కంటెంట్ ఇష్టపడేవారు “వధువు” కోసం ఓటీటీకి వస్తారనే నమ్మకం ఉంది. ఆ సెక్షన్ ఆడియెన్స్ ను “వధువు”తో బాగా ఆకర్షించబోతున్నాం.
“వధువు” స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ అందులోని ప్రశ్నలు నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇలా ఎందుకు జరిగింది అనే ఎన్నో ప్రశ్నలు స్క్రిప్ట్ లో ఉంటాయి. అవన్నీ ఆడియెన్స్ కు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. బెంగాలీ ఓరిజినల్ వెబ్ సిరీస్ ఇందులోని కొన్ని ఎపిసోడ్స్ చూశాను. జస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే ఆ ఎపిసోడ్స్ చూశా. మొత్తం చూస్తే నేను ఇందులా నా వెర్షన్ లో సహజంగా నటించలేనేమో అనిపించింది. “వధువు” స్క్రిప్ట్ లోని సస్పెన్స్ ఆకట్టుకుంటుంది.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చేసేప్పుడు నాకు పదేళ్ల వయసు. అప్పటికి పెళ్లంటే ఎంటే, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. సందేహాలు వస్తే డైరెక్టర్ ను అడిగేదాన్ని. ఇప్పుడు “వధువు” వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. పెళ్లి, వధువు అంటే ఏంటి అనే విషయాలు తెలుసు. చిన్నప్పుడే నటిగా మారడం వల్ల త్వరగా అన్ని విషయాలు నేర్చుకోగలిగా. అయితే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్ కు టైమ్ కోల్పోయినా…నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నా, ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నా.
ఇప్పటిదాకా నేను ఆన్ స్క్రీన్ పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా చీర కట్టుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం. చిన్నారి పెళ్లి కూతురు నుంచి “వధువు” దాకా ఎన్నో సందర్భాల్లో నా ఆన్ స్క్రీన్ మ్యారేజ్ జరిగింది. వధువులో ఫస్ట్ ఎపిసోడ్ లోనే పెళ్లీ సీన్ చేస్తున్నప్పుడు వెబ్ సిరీస్ కోసం మళ్లీ పెళ్లి కూతురు అయ్యా అనిపించింది. చిన్నారి పెళ్లి కూతురు టైమ్ కు వధువు చేసేప్పటికి నటిగా నాకున్న నాలెడ్జ్, అనుభవంలో చాలా మార్పు ఉంది.
దర్శకుడు పోలూరు కృష్ణ అనుభవం ఉన్న డైరెక్టర్. “వధువు” వెబ్ సిరీస్ ను ఆయన హాట్ స్టార్ లో ఉండాల్సిన క్వాలిటీ మెయింటేన్ చేస్తూనే టీవీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా రూపొందించాడు. ప్రతి సీన్ లో ఆ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు. “వధువు” క్రెడిట్ మా డైరెక్టర్ కు దక్కుతుంది. మా ఇంట్లో వాళ్లు వధువు ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
“వధువు” వెబ్ సిరీస్ లో ఇందూ క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఆమెకు తనదైన ఒక స్టోరి ఉంటుంది. తన లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ఇందు మనసులో మెదులుతూ ఉంటాయి. ఒక సాధారణ పెళ్లి కూతురుగా ఆమె ఉండదు.
ఈ వెబ్ సిరీస్ లో వెడ్డింగ్ సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉంటుంది. పెళ్లి జరుగుతున్న టైమ్ లో ఇందుకు తెలిసిన ఒక మహిళ అక్కడికి వస్తుంది. ఆమెను ఎవరూ పెళ్లికి పిలవకున్నా ఎందుకు వచ్చిందనే విషయంలో ఇందు షాక్ కు గురవుతుంది. ఆమె క్యారెక్టర్ ఎంట్రీతో ఈ వెడ్డింగ్ సీక్వెన్స్ లో డ్రామా క్రియేట్ అవుతుంది. మాన్షన్ 24 వెబ్ సిరీస్ తో పాటు వధువులో నందుతో కలిసి నటించా. తను మంచి కోస్టార్. వధువులో ఆయన పర్ ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా. ఆ సినిమా ఇంపాక్ట్ ఇప్పటికీ నా కెరీర్ మీద ఉంది. ఆ తర్వాత కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. ఇటీవల పాప్ కార్న్ అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా మారాను. ఆ సినిమా నా కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది. నా దగ్గరకు ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మంచి లవ్ స్టోరీస్ వచ్చినా చేస్తాను. నటిగా నాకు ఒకే జానర్ లో కంటిన్యూ కావాలని లేదు. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా చేస్తున్నా అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా.