రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై రెండు సంవత్సరాలు కావస్తోంది. తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన రష్యా తన దాడుల్ని మరింత పెంచింది. ఉక్రెయిన్‌ని బలహీనపరిచేందుకు ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని, డ్రోన్ దాడులకు ఎగబడుతోంది. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు ఈ యుద్ధం ఇంకెంత కాలం సాగుతుంది? అసలు దీనికి ముగింపంటూ లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. అయితే తాజాగా ఈ అంశంపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగదని, ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టాడు. ప్రపంచ దేశాల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొందని ఆయన పేర్కొన్నాడు. ఉక్రెయిన్ దూకుడు పెంచి రష్యాపై ప్రతిదాడులు మొదలుపెట్టడం వల్ల ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ బలగాల్ని వెనక్కు రప్పిస్తే యుద్ధం సద్దుమణుగుతుందని పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి మాట్లాడుతూ తప్పకుండా ఆ దేశం నాటోలో ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు అవసరమని లేకపోతే చరిత్ర పునరావృతమవుతుందని స్టోల్టెన్‌బర్గ్ హెచ్చరించారు.
Read Also..
Read Also..