గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట. కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు. ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది.పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన భోజనం ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినము అని అదేదో గొప్ప పని చేసినట్టుగా గొంతు పెట్టి చెప్తారు. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం.
ప్రసాదం ప్రాముఖ్యత
102
previous post