అయోధ్య రాముడికి కానుకగా తయారుచేసిన పాదుకలను స్వయంగా అందించేందుకు కాలినడకన బయలుదేరాడో భక్తుడు.. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు పాదయాత్ర మొదలుపెట్టాడు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ చార్ల శ్రీనివాస శాస్త్రి ఈ పాదయాత్ర చేపట్టారు. రాముడి కోసం ఒక్కోటీ 8 కిలోల చొప్పున వెండి పాదుకలను తయారు చేయించిన శాస్త్రి.. వాటిని తలపైన ధరించి గతేడాది అక్టోబర్ 28 న నడక ప్రారంభించారు. ఈ వెండి పాదుకలకు బంగారం అద్దాలనే తలంపుతో తన యాత్రకు మధ్యలో విరామం తీసుకున్నారు. పాదుకలను హైదరాబాద్ కు పంపించి వాటికి బంగారు పూత ఏర్పాటు చేయిస్తున్నట్లు శాస్త్రి తెలిపారు. బంగారు పూత తర్వాత ఒక్కో పాదుక బరువు 12.5 కిలోలకు చేరుతుందని, వాటి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని వివరించారు. రాముడి పాదుకలు తిరిగి వచ్చాక మళ్లీ నడక మొదలుపెడతానని, వచ్చే వారంలో అయోధ్యకు చేరుకుంటానని శాస్త్రి చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుని రాముడి పాదుకలను ఆయన చేతిలో పెడతానని పేర్కొన్నారు. ఈ పాదుకలను అయోధ్యలోని రామ మందిరంలో భక్తుల దర్శనానికి అనుకూలంగా ఉంచుతామని సీఎం యోగి హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, శ్రీనివాస శాస్త్రి గతంలోనూ అయోధ్య రాముడికి కానుకలు అందజేశారు. రామ మందిరం నిర్మాణానికి ఒక్కోటీ 2.5 కిలోల బరువున్న 5 వెండి ఇటుకలను అయోధ్యకు పంపించారు.
కాకినాడ నుంచి అయోధ్యకు పాదయాత్ర..
60
previous post