మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం(‘Somnath’ temple)..
సోమనాథ్ క్షేత్రం.. మహాశివు(Mahashiv)ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రం(Gujarat State)లో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అంటే.. చంద్రుడు అని అర్ధం. సోముడు కట్టించాడు కనుక సోమనాధీశ్వరుడుగా కొలుస్తారు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. గతంలో ఆరుసార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వల్ల.. ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. ఆయన మరణానంతరం మంత్రి కెఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.
సోమనాథ్ స్థలపురాణం…
దక్షుడి కుమార్తెలు 27 మందిని చంద్రుడు వివాహం చేసుకోగా.. వారిలో రోహిణి మీదే అతను ఎక్కువగా అభిమానం చూపుతుండేవాడు. దీంతో ఆగ్రహించిన మిగిలిన భార్యలు.. తమ తండ్రి దక్షునితో విన్నవించుకుంటారు. చంద్రుడు తమ మీద ఎటువంటి అభిమానం చూపడం లేదని, రోహిణి మీదే ప్రేమ చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు.. తన అల్లుడైన చంద్రుడిని శపించాడుట. అతని వాపంతో చంద్రుడు క్షయ వ్యాధి బారిన పడతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు.. తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని స్తాపించి, శివునిని నిత్యం పూజించేవాడు. ఇతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై.. అతనిని శాప విమోచనం చేశాడు. అతడు శాపవిమోచనం పొందిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్దం. అనంతరం.. శివుని ఆజ్ఞమేరకు చంద్రుడు అందరినీ సమానంగా చూసుకునే వాడని చరిత్ర కథనం. చంద్రుడు స్తాపించిన లింగంలో తానూ కొలువై వుంటానని శివుడు మాట ఇచ్చాడుట. అందుకే ఇక్కడి శివుడిని సోమనాధుడు అని పిలుస్తారు.
ఇది చదవండి: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి..
ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, తరువాత రావణుడు వెండితో కట్టించాడని పురాణ కథనాల్లో తెలుపబడి వుంది. అనంతరం ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కొయ్యతోను, భీముడు రాతితోను తిరిగి నిర్మించారని చరిత్ర కధనాలు చెబుతున్నాయి. సోమనాథ్ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించ బడింది. ఈ ఆలయంలో అపారమైన సంపద వున్న కారణంగా దానిని కొల్లగొట్టేందుకు 1024లో ఘజని మహమ్మద్ ఇక్కడికి చేరుకొని, దండయాత్ర చేసి మొత్తం సంపదను దోచుకోవడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఈ ఆలయం తిరిగి నిర్మించబడింది. అయితే 1308లో అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యంచే మళ్ళీ నాశనమయింది. ఔరంగజేబుతో సహా ముస్లిం రాజులచే ఈ ఆలయం అనేక మార్లు ధ్వంసం అయింది. ఈ ఆలయం చరిత్రలో దండయాత్రలకి గురవుతూ.. తిరిగి నిర్మింపబడుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం భారత స్వాత్రంత్ర్యానంతరం 1950 తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చే నిర్మితమైంది. సౌరాష్ట్రాలో అరేబియన్ సముద్ర తీరాన వెలసిన ఈ ఆలయం ఎంతో సుందరమైనది. ఆలయం లోపల అంతా సువర్ణమయమై, అందమైన శిల్ప కుడ్యాలతో అలరారుతూ వుంది.
సోమనాథ్ ఆలయ నిర్మాణం…
ఆలయం లోపల విశాలమైన మంటపం, ఎత్తైన, అందమైన గుండ్రటి గోపురం అందంగా కనిపిస్తుంది. గర్భగుడిలో శివలింగం చాలా పెద్దది. శివలింగం వెనుక పార్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది. ద్వారానికి కుడిపక్క వినాయకుడి విగ్రహం, ఎడమ పక్క ఆంజనేయ విగ్రహం వున్నాయి. ఆలయంలో విశాలమైన గర్భగుడి, బంగారు గోడలు, తలుపులు, వివిధ రకాలుగా అందమైన అలంకరణలో శివుడు, సుగంధ పరిమళాల మధ్య ధూప దీప కాంతులతో హారతుల మధ్య, శివనామ స్మరణం తో మారుమ్రోగే ఆలయ ప్రాంగణం, ఆలయాని తాకే సాగర కెరటాలు, ఆ వాతావరణమే ఎంతో అద్భుతం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.