భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం భారత రాజ్యాంగం అని పొన్నూరు ఎమ్మెల్యే, వైయస్సార్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కిలారి వెంకట రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ.. భారతదేశానికి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని మన రాజ్యాంగానిదే అన్నారు. వివిధ కులాల, మతాల, సంస్కృతుల, ప్రాంతాల భారతీయులు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలమే అన్నారు. ఆ మహానీయుడు అంబేద్కర్ అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి భవిష్యత్తు మెరుగుపడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పొన్నూరు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఈ ఐలాండ్ సెంటర్ ప్రాంతం నేటి నుండి అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేస్తూ తీర్మానం చేశామని, ఇకనుంచి దీన్ని అందరూ అంబేద్కర్ సెంటర్ గా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అందరికీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం.. భారత రాజ్యాంగం – రోశయ్య
52
previous post