పలివెల క్షేత్రానికి(Palivela Kshetram) బారులు తీరిన భక్తులు…
భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు, ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ, ఘనంగా శివరాత్రి వేడుకలు. కొత్తపేట(Kothapet) .. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోగల శైవక్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తెల్లవారు జామున నుండే స్వామి వారి దర్శనం కోసం శివాలయం నందు బారులు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరో ప్రక్క ఓం కార నాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ హర హర మహా దేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మర్మోగించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. 20 రూ ప్రత్యేక దర్శనం తో పాటు ఉచిత దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ భమిడిపాటి లక్ష్మీ నారాయణ ఈ. ఓ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్.ఐ బి.అశోక్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి