వింధ్య పర్వతాలలో ఓంకార క్షేత్రమున్నది అంటారు. ఆ క్షేత్రాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ, వింధ్య పర్వతము మీదికి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురువెళ్ళి స్వాగత సత్కారాలందించి. ఉచిత రీతిన గౌరవించాడు. వారి ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు అయిన తరువాత ఇష్టాగోష్టి జరుగుతోంది. ఆ సమయంలో వింధ్యరాజు “నారద మహర్షి మీరు త్రిలోక సంచారులు. మీకు తెలియని విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారము మొదలైన లోహములు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగినవాడు నేను గాక ఇంకెవరు ఉంటారు?” అన్నాడు. ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు. నారదుడు తనని మెచ్చుకోకుండా అలా నిట్టూర్పు విడిచేసరికి ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు. మహర్షి నిట్టూర్పుకు కారణము ఏమిటి? పర్వతాలలో సార్వభౌముడు తను కాదా? అని ఈ రకంగా ఆలోచిస్తూ “మహర్షీ నేను అలా అనగానే ఇలా నిట్టూర్పు విడుస్తున్నారు ఎందుకు?? మీరు అలా నిట్టూర్చడం వెనుక అర్థం ఏమిటి?” అన్నాడు. దానికి నారదుడు “వింధ్యరాజా! నువ్వు చెప్పినదంతా నిజమే. నీ దగ్గర సర్వసంపదలు ఉన్నాయి, సమస్త ధాతువులు ఉన్నాయి, బంగారము మొదలుగా గల లోహాలు అన్నీ ఉన్న మాట నిజమే. కాని మేరుపర్వత శిఖరాల గురించి తెలియదా?? ఆ శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. మరి వారందరూ నీదగ్గరకు వస్తున్నారా?? నీకా భాగ్యము లేదు. అందుకే నాకు విచారము. నా నిట్టూర్పుకు కారణం అదే” అన్నాడు. మేరు పర్వతము కన్న గొప్ప అనిపించుకోవాలనే పట్టుదల వింధ్య పర్వతానికి కలిగింది. దానికోసం ఆ పరమేశ్వరుని ఆరాధించటము తప్ప మరే మార్గం లేదు అని నిశ్చయించి తపస్సు చెయ్యటానికి ఓంకార యంత్రము ఒకటి తయారుచేసి, దాని మీద పార్ధివ లింగము స్థాపించి సంకల్పించాడు. ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపతి. ప్రత్యక్షమై ‘ఏ వరం కావాలో కోరుకో!’ అన్నాడు. “పరమేశ్వరా! చంద్రమౌళీశ్వరా! పాహిమాం తండ్రీ! పాహిమాం! నీ కరుణ లేశమాత్రము ఉన్నప్పటికీ, నీ భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు. నాకు ఇంక కావలసినది ఏమున్నది. అయినప్పటికి నాదొక చిన్న ప్రార్ధన. మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా, దేవతలు విహరించటానికి వీలుగా ఉండటము నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి. అటువంటి నువ్వు, నా శిఖరాన సదా నివసించవలసినదిగా నా ప్రార్ధన” అన్నాడు వింధ్యరాజు. ఆ పలుకులు ఆలకించిన శంకరుడు, భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు.. ఇప్పుడు ఓంకార యంత్రము, పార్థివ లింగము రెండుగా అయిపోయినాయి. ఓంకార యంత్రమందు ఉద్భవించినవాడు కాబట్టి ఓంకారేశ్వరుడు, పార్ధివ లింగమందు ఉద్భవించినవాడు కాబట్టి అమలేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ నర్మదానది కూడా రెండు పాయలుగా చీలిపోయింది. ఆ రెండు పాయల నడుము ఒక శిఖరమున్నది. ఆ శిఖరము మీద సూర్యవంశపు రాజు మాంధాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు. ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి, విష్ణువురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి. ఇదీ ఓంకారేశ్వరుడి కథ.
ఓంకారేశ్వరుడు ఎలా వెలశాడో తెలుసా?
63
previous post