ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల వారిగా ఎలక్షన్ కమీషన్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరగనున్న 49 కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
ఇక పోలింగ్ సందర్భంగా రేపు ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 500 పోస్టల్ ఓట్లకు ఒక టేబుల్.. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 లక్షల మంది పోస్టల్ ఓటింగ్ చేయడం జరిగింది. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.రేపు జరుగనున్న కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.