పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్.ఎన్.రవి రద్దు చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. గవర్నర్ ను కూడా కలిసేదిలేదని భీష్మించుకున్నారు. దీంతో ప్రతిష్టంభన నెలకొన్నది. ఈక్రమంలోనే అసెంబ్లీ రద్దు అయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి ప్రకటన వెలువడింది.
సీఎంగా మమతా బెనర్జీ రాజీనామా చేసినా..చేయకపోయినా ఆమె పదవి రద్దయినట్లే..ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. శనివారం బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈలోపే బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోవడానికి అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని పార్టీ బెంగాల్ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు బెంగాల్ సీఎం అభ్యర్థిగా సువేందు అధికారి పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో టాక్ ఉంది. అధికార ప్రకటన రావాల్సి ఉంది. అదికూడా లాంఛనమేనని ఆ పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా..బీజేపీ శాసన సభపక్షనేతను నిర్ణయించడంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్..అధిష్టానం నిర్ణయం మారితే తప్పితే ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
National
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నుంచి ప్రజలు కొన్నేళ్ల క్రితమే తేరుకున్న సమయంలో…. మరో మహమ్మారి భయందోళనలు సృష్టిస్తోంది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఓ క్రూయిజ్ నౌకలో అరుదైన ‘హంటా వైరస్’ కలకలం రేపుతోంది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ … అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పర్యాటక బోటులో ఇటువంటి వైరస్ వ్యాప్తి చెందడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. హంతావైరస్ అనేది హంటావిరిడే కుటుంబానికి చెందిన వైరస్ల సమూహం. ఇది ప్రధానంగా ఎలుకలు, చిట్టెలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన ఎలుకల మూత్రం, లాలాజలం లేదా మలంతో మనుషులకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. హంతావైరస్ నేరుగా మనిషి ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందుకే దీనిని అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటిగా పరిగణిస్తారు.ప్రస్తుతం వార్తల్లో నిలిచిన డచ్ క్రూయిజ్ షిప్లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ షిప్ బ్రెజిల్, అంగోలా, స్పెయిన్ వంటి దేశాల తీరాల మీదుగా ప్రయాణించింది. ఈ ప్రయాణ సమయంలో ముగ్గురు వ్యక్తులు హంతావైరస్ లక్షణాలతో మరణించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ఈ వైరస్ పట్ల భారతీయులు ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయాని. భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ 23 దేశాలు కూడా మనకు చాలా దూరంగా ఉన్నాయన్నారు. ఆసియా ఖండంలో కనిపించే హంతావైరస్ రకాలు మనిషి నుంచి మనిషికి వ్యాపించవు. కేవలం ఎలుకల ద్వారా మాత్రమే చాలా అరుదుగా సోకుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సామాన్య ప్రజలకు దీనివల్ల పెద్ద ముప్పు లేదని స్పష్టం చేసింది.
తమిళనాడు రాజకీయాలు క్షణాక్షణానికీ మారుతున్నాయి. TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఆగిపోవడంతో హైడ్రామా మొదలైంది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం హెచ్చరికలు, ఇటు ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు, గవర్నర్ లోక్‌భవన్, ఇతర కీలక ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన కూడళ్లలో కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అది తీవ్రమైన శాంతిభద్రతల సమస్యగా మారుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
తమిళనాడులో హంగ్ ఏర్పడే సంకేతాలు రావడంతో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకేలో చీలికలు మొదలయ్యాయి. అన్నాడీఎంకేకు చెందిన సుమారు 27 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టుకు తరలి వెళ్లారు. సీవీ షణ్ముగం నేతృత్వంలో ఆ ఎమ్మెల్యేలంతా రిసార్టులో మకాం వేశారు. విజయ్ (TVK) ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు “విజయ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన అన్నాడీఎంకే అగ్రనాయకత్వం, ఇప్పుడు ఎమ్మెల్యేల ఒత్తిడితో సందిగ్ధంలో పడింది. మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని భావిస్తుండటంతో పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకారానికి కావలసిన మెజార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉన్నారు. మరి విజయ్‌కు ఏ పార్టీ మద్దతిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర హింసతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో గుర్తు తెలియని దుండగులు అతి దగ్గరి నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆయనమీద కాల్పులు జరిగాయి. బుల్లెట్ గాయాలైన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారు. చంద్రనాథ్ సువేందుకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు భారీగా అక్కడకు చేరుకున్నాయి. దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుల కోసం గాలిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకప్పటి తన రాజకీయ గురువైన మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ నేత సువేందు అధికారి బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది ఆ పార్టీ. రేపు కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఆయన పేరును ప్రతిపాదించనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున సువేందు అధికారి బలమైన అభ్యర్థిగా నిలిచారు. ఒకప్పుడు మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్‌లో.. ఆమెపై గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఆమె కంచుకోటగా భావించే భవానీపూర్‌లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఈ విజయాలే ఆయనను ముఖ్యమంత్రి పీఠం వైపు నడిపిస్తున్నాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ శైలి విభిన్నం. పదిహేనేళ్ల పాటు నిరాటంకంగా ఏలిన ఆమె సీఎం కుర్చీని వీడటానికి సుముఖంగా లేదు. ఆమె కుర్చీకి అతుక్కుపోవాలని చూస్తున్నారు. తన పదవికి రాజీనామా చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. గౌరవంగా రాజీనామా చేయకుండా మొండికేస్తున్న ఆమెపై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలాలు వెల్లువెత్తుతున్నాయి.
టీఎంసీ ఓడిపోయిన మరుసటి రోజే కోల్ కతాలోని టీఎంసీ పార్టీ ఆఫీసును స్థానికులు, వ్యాపారులు కలిసి బుల్డోజర్ తో కూల్చివేశారు. ఓ దుకాణదారుడి నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కుని, అక్కడ యూనియన్ ఆఫీసు కట్టారంటూ స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు బుల్డోజరుతో కూల్చివేశారు.పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని న్యూ మార్కెట్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాల్సి వచ్చింది.
తాజాగా ఈసీ ‘కాన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూ అసెంబ్లీ’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఆమెకు ఊహించని షాకేనని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి పదవి గవర్నర్ ఆమోదం ఉన్నంత వరకు మాత్రమేనని తెలిసినా మొండిగా వ్యవహరించటం పట్ల రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అమిత్ షా వంటి అగ్రనేతల పర్యవేక్షణలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక , ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన బీజేపీ నూతన ప్రభుత్వం కొలువుదీరాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని దాదాపు ఖరారుచేసింది. అమిత్ షా అధికారికంగా ప్రకటించటమే తరువాయి. రెండు చోట్ల మమతను ఓడించి పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించిన సువేందు అధికారి సీఎం పీఠం వైపు అడుగులు వేస్తున్నారు.
ఇదిలావుండగా సీఎం మమతా బెనర్జీ వ్యవహారశైలిని పలువురు ప్రముఖలు తూర్పారపడుతున్నారు. తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ప్రవర్తన క్షమించరానిదని, ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా తీవ్రంగా స్పందించారు. మమత వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. ఆమె రాజీనామా చేయకపోతే, బర్తరఫ్ చేయడమే ఏకైక మార్గమని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు ఆమెను, ఆమె తప్పులను చాలాకాలంగా సహించారన్నారు. ఏదిఏమైనా మమతా బెనర్జీ మడత పేచీ నేపథ్యంలో.. ఇప్పుడు ఏం జరుగుతుంది, బెంగాల్ గవర్నర్ ఏం చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్న వేళ.. చెన్నైలో ఒక ఆసక్తికర భేటీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలైన తర్వాత, ఆ పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ అయ్యారు. మే 6న స్టాలిన్ నివాసానికి వెళ్ళిన రజినీ.. తాజా రాజకీయ పరిణామాలు మరియు ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఓటమి తర్వాత ఒత్తిడిలో ఉన్న స్టాలిన్‌కు రజినీకాంత్ సంఘీభావం తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయకేతనం ఎగురవేసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఇద్దరు దిగ్గజాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని సంచలనం నమోదైంది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. శివగంగై జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గంలో ఆయనపై..TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చారిత్రక విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న పెరియకరుప్పన్‌కు తుది ఫలితం షాక్ ఇచ్చింది. TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి 83 వేల 375 ఓట్లు రాగా, మంత్రి పెరియకరుప్పన్‌కు 83 వేల 374 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కేసీ తిరుమారన్ 29 వేల 54 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఫలితంతో తిరుపత్తూరులో 2006 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పెరియకరుప్పన్ 20 ఏళ్ల అజేయ ప్రస్థానానికి తెరపడింది.
ఫలితం వెలువడిన వెంటనే రీకౌంటింగ్ నిర్వహించాలని డీఎంకే ఏజెంట్లు కోరినప్పటికీ అందుకు అధికారులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాన్ని మద్రాస్ హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన TVK ..108 స్థానాల్లో గెలిచి, అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించిన వేళ ఈ విజయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను తారుమారు చేసి ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ, ప్రస్తుతం గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధమౌవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118 సంఖ్యాబలం లేక.. గవర్నర్ అనుమతి నిరాకరించడంతో విజయ్ నేటి ప్రమాణస్వీకారం రద్దయ్యింది. టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే ను.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నుంచి ప్రతికూల స్పందన ఎదురైనట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్‌కు, సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలను గవర్నర్ గుర్తుచేశారు. తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేయడంతో తమిళనాడులో సస్పెన్స్ కు తెరలేపింది.
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 108 సీట్లు.. విజయ్ రెండు చోట్లా గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి నికరంగా 107 సీట్లు . మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దీంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. కాగా… కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని, ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని విజయ్ గవర్నర్ కు వివరించారు. అయితే, ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖ ఉంటేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా…అన్నాడీఎంకే పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం.. సుమారు 35 మంది విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, పీఎంకే (4), ఐయూఎంఎల్ (2), సీపీఐ (2), సీపీఎం (2) వంటి పార్టీల మద్దతు కూడగట్టడంపై టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సాధించడానికి టీవీకే పార్టీకి10 సీట్లు అవసరమయ్యాయి. ఇప్పటికే టీవీకే కు కాంగ్రెస్ మద్దతు తెలుపగా, అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. టీవీకేతో పొత్తు పెట్టుకునే విషయంపై తమ పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని సీవీ షణ్ముగం స్పష్టం చేశారు. ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సత్యన్ కూడా స్పందించారు. పార్టీలో విభేదాలు, చీలికలు లేవని స్పష్టం చేశారు. అలాగే, ఏఐఏడీఎంకే, టీవీకే వర్గాల మధ్య సఖ్యత మొదలైందన్నారు. హైకమాండ్ నిర్ణయం కోసం వేచి ఉండాలని చెప్పారు. . ఇదిలా ఉండగా, పొత్తును కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామితో సమావేశమయ్యారు. కాంగ్రెస్.. తన మిత్రపక్షాలైన వీసీకే, వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ..ప్రస్తుతానికి ఈ 6 మంది ఎమ్మెల్యేల కొరత తీరితే తప్ప.. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదు? తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ టీవీకే ఎమ్మెల్యేలు రిసార్ట్ లోకి వెళ్లాలని విజయ్ ఆదేశించడంతో తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి..
భారతదేశ డిజిటల్ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా విడివిడిగా ఉన్న ఆరోగ్య విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ స్వస్థ్ భారత్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది వివిధ ఆరోగ్య కార్యక్రమాలను ఏకీకృతం చేసే వన్-స్టాప్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ భారం తగ్గడమే కాకుండా, డేటా సేకరణలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సరికొత్త పోర్టల్ ద్వారా డేటా ఎంట్రీ లో డూప్లికేషన్ సమస్య తొలగిపోనుంది. ఫలితంగా నివేదికలు త్వరగా అందుతాయి, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు వేగంగా తీసుకునే వీలుంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ పోర్టల్, అభా ఐడీతో అనుసంధానం చేయబడింది. దీనివల్ల ఆరోగ్య సమాచార మార్పిడి మరింత సురక్షితంగా మారుతుంది. ఈ వ్యవస్థ వల్ల మౌలిక సదుపాయాలపై భారం 20 నుంచి 30 శాతం తగ్గుతుందని, హెచ్ఆర్, డేటా ఎంట్రీ పనుల్లో 20 నుంచి 40 శాతం సామర్థ్యం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.