హస్తం నుండి కొత్తగూడెం టికెట్ పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్నా పొత్తుల పేరుతో తమను బలిచేసారని ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోత్తులో కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాంచడంతో ఏళ్ళ తరబడి పార్టీ పటిష్టం కోసం కష్టబడుతున్న నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ఐదేళ్ల పాటు సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటూ వచ్చిన తమకు కాళీ చేతులు చూపించారని మండిపడుతున్నారు. పార్టీ బలంగా ఉన్న స్థానం పొత్తుల్లో ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పొత్తుల పేరుతో బీసీల గొంతు నొక్కారని మండిపడుతున్నారు. రాజీనామాలు అయినా చేస్తాము కానీ సీపీఐకి ససేమిరా మద్దతు తెలుపమని తెగేసి చెబుతున్నారు. కొత్తగూడెం లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ఆశావాహులు అధికంగానే ఉన్నా… తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని అధిష్టానానికి మూకుమ్మడిగా విజ్ఞప్తి చేశారు. అయినా అధిష్టానం సీపీఐ కే టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతోంది . టీపీసీసీ సభ్యులు యెడవెల్లి కృష్ణ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నిలిచేందుకు సిద్దమవుతున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారిని కాదని నెల ముందు వచ్చిన వారికి పార్టీ ప్రాధాన్యతను ఇస్తుందని యెడవెల్లి కృష్ణ వాపోతున్నారు. 2018 లోనూ ఈవిధంగానే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ తనను వదిలి వేరే అభ్యర్థికి టికెట్ కన్ఫామ్ చేసారని, ప్రస్తుతం పొత్తుల పేరుతో తనకు మళ్లీ అన్యాయం జరుగుతుందని అందుకే కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగుతున్నారు. ఈ తరుణంలో రెబల్ అభ్యర్థిగా ఎడవెల్లి క్రిష్ణ కు కాంగ్రెస్ క్యాడర్ మద్దత్తుగా నిలిచేందుకు సిద్దమైంది. దీంతో పొత్తుల్లో సీటు దక్కించుకున్న సీపీఐ… పొత్తు ధర్మం పాటించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై ఒత్తిడి పెంచుతోంది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ కి లాభం అంటూ హెచ్చరిస్తోంది. పొత్తుల్లో వచ్చిన ఒక్క సీటులో రెబల్ బెడద సీపీఐ ను కలవరపెడుతుంటే … తమకు పార్టీ అన్యాయం చేసిందనే ఆవేదన లో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.
కాంగ్రెస్ నేతలకు షాక్..!
138
previous post