దేహాభిమానాన్ని వదిలితేనే జీవుడు… దేవుడు చిన్నికృష్ణుడు గోకులంలోని ఇండ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలించినప్పుడు “కృష్ణా మా ఉపాధులనే కుండలను పగులగొట్టి హృదయమనే వెన్నను దొంగాలించావా.. ఎంత దొంగవయ్యా నీవు”.. అని… అంటుంటారు గోకులంలోని యాదవులు, భగవంతుడు మనకు మనోబుద్ధులను ప్రసాదించింది మనం మోక్షాన్ని పొందటానికే. కాలం వృధా చేసుకోకుండా ఆద్యాత్మిక చింతనతో సాధన చేసి మోక్షాన్ని పొందాలి. భగవంతుడిచ్చిన వాటిని తిరిగి ఆయనకే సమర్పించాలి. లేకపోతే దర్మం తప్పినవారవుతారు. మనసు నిజంగా లౌకికానందాల గని… అది తనకు నచ్చిన పనులు చేస్తుందే గాని బుద్ది చెప్పిన పనులు చేయదు. తల దువ్వుకోటానికో నగలు అలంకరించుకోటానికో; బూటు పాలిష్ చేసుకోవటానికో; కాలరు టై బిగించుకోటానికో; సౌందర్య లేపనాలను రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది గాని, జపం చెయ్యటానికో, ధ్యానం చెయ్యటానికో పట్టుమని పది నిమిషాలు కేటాయించదు. భగవంతుడిని ధ్యానం చెయ్యమంటే మాత్రం అమ్మో కష్టం నావల్లకాదు బాబు అంటుంది మనసు. జపం చెయ్యటం లేదేం, ఎవరైనా గురువులు మనల్ని ధ్యానం చెయ్యండి, జపం చేయండి, దీక్షలు తీసుకొండి అంటే చాలు.. ఏదండీ గురువుగారు అసలు తీరుబాటు కావటం లేదంటారు. “మీలాగా మేం ఆస్రమాల్లో లేము గదా”.. అని పైకి అనకపోయినా లోన అనుకొంటారు. ఇల్లూ, వాకిలి, పెళ్ళాం, బిడ్డలు, ఉద్యోగం, వ్యాపారం బోలెడు జంజాటకం. ఇవన్నీ కదల నివ్వటం లేదు అంటారు. నిజంగా అవి మనను పట్టుకున్నాయా.. మానవులు వాటిని పట్టుకొని విడిచిపెట్టలేక పోతున్నారా.. మామిడి తోటల్లో రైతులు కోతుల బెడద విలించుకోటానికి కడవను తీసుకెళతారు. దాని మూతి చిన్నది, పొట్ట పెద్దది. దానిని భూమిలో గుంట తీసి పూడ్చి మూతి మాత్రం భూమిపై కనిపించేట్లు ఉంచుతారు. దానిలో వేరుశెనగ పప్పులు వేస్తారు. వాళ్ళు చెట్టు చాటున నక్కి ఉంటారు. కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశెనగ పప్పులను గుప్పిటి నిండా గట్టిగా పట్టుకుంటుంది. చెయ్యి బయటకు తీయబోతే రాదు. ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి మాత్రమే, కానీ.. బయటకు తీసేటప్పుడు పప్పులతో ఉన్న గుప్పెట. చెయ్యి బయటకు రాకపోయే సరికి అసలే చపలచిత్తం గదా.. లోపల ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారను కుంటుంది. తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది. కాని అది గుప్పెట మాత్రం వదలదు. అలా చేతిని బయటకు లాగిలాగి పడిపోతుంది. దానితో కోతులను పట్టుకునే వ్యక్తి వచ్చి వాటిని పట్టుకుంటాడు. మానవుడు కూడా అంతే కదా … ఇక్కడి విషయవాసనలను పట్టుకొని వదలడు. అవే మనను పట్టుకున్నాయని వాదిస్తాడు. పోరాడి పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తారు గాని పట్టు మాత్రం వదలరు.. పట్టువదలరు.. దానితో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు. కనుక మనస్సు విషయవస్తువుల వ్యామోహం నుండి విడివడాలి. వాటిని విడిచి మనస్సును ఈశ్వరుని పై నిలపాలి. అలా ఎవరైతే మనోబుద్ధులను ఈశ్వరుని పై నిలుపుతారో వారు ఈశ్వరుని లోనే నిలుస్తారు, నివశిస్తారు. అంటే మనోబుద్ధుల అడ్డం తొలిగితే జీవుడు దేవుడే. ‘ఇందులో ఎటువంటి సంశయం అవసరం లేదు’. మనోబుద్ధులు రెండూ మన వ్యక్తిత్వమే. ఆ రెండూ భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవటం జరుగుతుంది. ఉప్పుబొమ్మ సముద్రపు లోతులను కొలుస్తున్నట్లే మనస్సు ఆత్మసాగారాన్ని మధించాలి. చివరకు ఉప్పుబొమ్మ కరిగిపోయి సముద్రాకారంగా మారిపోయినట్లు మనస్సు కరిగి ఆత్మాకారంగా మారిపోవాలి. మన దివ్యత్మాన్ని మరచి నేను సామాన్యుణ్ణి అనుకొనే మానవుడు ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నాడు. ఇందులో సందేహించవలసిందేమీ లేదు. ఈశ్వరుని యందు మనోబుద్ధులు రెండింటినీ పూర్తిగా నిలపటం తీవ్ర వైరాగ్య మూర్తులకే గాని సామాన్యులకు సాధ్యం కాదు..కానీ సాధనచేస్తే సాధ్యంకానిది వుందా ఈ జగత్తులో.. మీరే ఆలోచించండి.
జీవుడు- దేవుడు
120
previous post