మలయాళ నటుడు, మాజీ ఎంపీ సురేశ్ గోపీ ఓ మహిళా జర్నలిస్టుతో వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సురేశ్ గోపీపై గతంలో పెద్దగా వివాదాలేమీ లేకపోగా, ఆయన తాజా ప్రవర్తన విస్మయం కలిగిస్తోంది. ఉత్తర కోజికోడ్ లో జరిగిన ఓ కార్యక్రమం సురేశ్ గోపీని మీడియా పలకరించింది. సురేశ్ గోపీ తనకు సమీపంలో నిల్చుని మైక్ పట్టుకుని ఉన్న మహిళా జర్నలిస్టు భుజంపై చేయి వేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె నవ్వుతూనే ఆయన చేయిని తొలగించారు. తర్వాత కాసేపటికి సురేశ్ గోపీ మరోసారి ఆమె భుజంపై చేయి వేశారు. ఆమె మళ్లీ ఆ చేతిని తీసివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సురేశ్ గోపీ తీరుతో ఆ పాత్రికేయురాలు ఇబ్బందిపడినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. దాంతో, సీనియర్ నటుడి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, సురేశ్ గోపీ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమెను తన కుమార్తెగా భావించి చనువుగా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు. వాత్సల్యంతోనే భుజంపై చేయివేశానే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా, ఆమె ఇబ్బంది పడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు.
మహిళా జర్నలిస్టుపై చేయి వేసిన నటుడు సురేశ్ గోపీ..
138
previous post