అనంతపురం జిల్లా…
రాయదుర్గం నియోజకవర్గం…
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పెద్ద ఎత్తున కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా
- అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి ఇసుక రిచ్ పై మైన్స్ అండ్ జియాలజీ అధికారులు దాడులు
- ఒక హిటాచి, 17 టిప్పర్లు సీజ్ చేసిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు
- రాయదుర్గం రెవెన్యూ అధికారులకు అప్పగింత
- అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జంజురాంపల్లి వేదవతి హగరి నది ఇసుక రీచ్ పై మైనింగ్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసినా తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదుతో వెళ్లిన మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారులు. హిటాచి, 17 టిప్పర్లు సీజ్ చేసి రాయదుర్గం రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనంతపురం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ ఇంచార్జ్ అధికారి, తాడిపత్రి కి చెందిన నాగన్న ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. గత కొద్దిరోజులుగా ప్రభుత్వ అనుమతులు ముగిసిన పెద్ద ఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్లలో బహిరంగంగా ఇసుకను తరలిస్తూ జెకె కంపెనీ వారు ఇసుక రీచ్ లో వసూళ్లకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రిపూట భారీ సంఖ్యలో టిప్పర్లలో జుంజురాంపల్లి, వేపరాళ్ళ రీచ్ల నుంచి ఇసుక కర్ణాటకకు అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని రాయదుర్గం నియోజకవర్గంలో నుంచి అధికార పార్టీ నేతలు అండదండలతో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగుతోంది. ఇసుక టిప్పర్లు సీజ్ చేసిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనంతపురం వెళ్లడం శోచనీయం. ఇసుక టిప్పర్లు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకున్న తెదేపా నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో ఉంచిన టిప్పర్లను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ డిపో వద్ద కాలవ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైకాపాలనలో ఇసుక అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతుందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 ఇసుసుక రీచులు ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబునల్ అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలతో , రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండదండలతో ఇసుక స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని ఆయన ఆరోపించారు. జుంజురాంపల్లి ఇసుక రీచ్ లో సీజ్ చేసిన టిప్పర్ల వివరాలను అధికారులు వెల్లడించాలని, వాటిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.