అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎదుట మావోయిస్టు పప్పులూరు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పాడేరు ఎస్పీ కార్యాలయంలో తూహిన్ సిన్హా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వచ్చందంగా లొంగిపోయిన వారిని ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం పప్పులూరు దళానికి చెందిన సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యులు కిల్లో త్రినాద్ అలియాస్ రాజేష్… కిల్లో బాబూరావు అలియాస్ సుత్తి వీరు మల్కానగిరి జిల్లా ఈతలంక గ్రామస్థులు కాగా, వీరిద్దరూ పప్పులూరు ఏరియా దళ కమాండర్ పార్వతి ప్రోద్బలంతో 2008 సంవత్సరంలో మిలీషియా సభ్యులుగా చేరి, సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీ పప్పులూరు దళంలో కలిమెల, ఏఒబి ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులు, మందుపాతర పేలుళ్లు, కరువు దాడుల్లో పాల్గొన్నారు. అదే విధంగా లొంగిపోయిన ముగ్గురు మిలీషియా సభ్యులైన కిల్లో రాజు. వంతల భగత్ రామ్, పాంగి సదునో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల మావోయిస్టు పార్టీకి ఆదరణ తగ్గిపోవడం, పోలీస్ కాంపులు పెరగడంతో, స్వేచ్ఛగా తిరగలేక ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు కమ్యూనిటీ పోలిసింగ్, ఫ్రెండ్లీ పోలిసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు కల్పిస్తున్న ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు, నిరుద్యోగ గిరిజన యువతకు వ్యాపార నిమిత్తం బ్యాంక్ రుణాలు అందించే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయంతో స్వచ్చందంగా లొంగిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భముగా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిశోర్, జీ.కే.వీధి సిఐ జి.అశోక్ కుమార్, సీలేరు ఎస్సై జె.రామకృష్ణల సేవలను కొనియాడారు.
ఎస్పీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు..
62