ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులు ఏ క్షణంలోనైనా బయటకు రావొచ్చని అధికార వర్గాల సమాచారం. రెస్క్యూ పనులు తుది దశకు చేరుకున్నాయని, టన్నెల్ కు సమాంతరంగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చివరకు వచ్చాయని అధికారులు చెప్పారు. వాస్తవానికి ఈ రోజు ఉదయమే కార్మికులను బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. అయితే, డ్రిల్లింగ్ పనుల చివరి దశలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయని, చివర్లో ఇనుప రాడ్లు బయటపడడంతో డ్రిల్లింగ్ పనులు నెమ్మదించాయని వివరించారు. కార్మికులను బయటకు తీసుకురాగానే వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు టన్నెల్ బయట 41 అంబులెన్స్ లను అధికారులు సిద్దం చేసి పెట్టారు. టన్నెల్ కు సమీపంలో 41 పడకలతో తాత్కాలికంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అవసరమైతే హుటాహుటిన తరలించేందుకు హెలికాఫ్టర్ ను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డ్రిల్లింగ్ పని పూర్తికాగానే స్టీల్ పైపును అమర్చి, లోపలికి వెళ్లేందుకు 15 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా టన్నెల్ లో సిద్ధంగా ఉంది. కార్మికులను ఎలా బయటకు తీసుకురావాలనే విషయంపై ఈ బృందం ఇప్పటికే పలుమార్లు మాక్ డ్రిల్ నిర్వహించి సిద్దమైంది. ఉత్తరకాశీలోని ఈ టన్నెల్ ముందువైపు కుప్పకూలడంతో ఈ నెల 12 నుంచి 41 మంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారవర్గాలు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేశాయి. లోపల ఉన్న వారికి పైపుల ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాలు, దుస్తులు సహా అవసరమైన వాటిని పంపించారు. డ్రిల్లింగ్ కోసం భారీ మెషినరీ తెప్పించి విశ్రాంతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ లో మునిగిపోయారు. అధికారులు, రెస్క్యూ టీమ్ కృషి ఫలించి మరికాసేపట్లో కార్మికులంతా క్షేమంగా బయటపడనున్నారు.
ఏ క్షణంలోనైనా టన్నెల్ లో బయటకు రానున్న కార్మికులు
58
previous post