కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజవర్గ ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తారు. వరుసగా రెండుసార్లు ఎవరినీ గెలిపించరు. అదే విధంగా స్థానికేతరులనే గెలిపిస్తారు. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి మూడు పార్టీలు టికెట్లు ఆశిస్తున్నాయి. కానీ టిడిపి, జనసేన పొత్తులో ఉన్నాయి. మరో పక్క వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు రాదన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం పిఠాపురం నుంచి పెండెం దొరబాబు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు అసమ్మతి అధికంగా ఉంది. పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో పలు దఫాలు ఆయనను నిలదీశారు. కొత్తపల్లి మండలంలో రెండు వర్గాలు కేసులు పెట్టుకున్నాయి. ఇదే మండలంలోని నాగులాపల్లి లో ఎమ్మెల్యేను పరుగులు పెట్టించారు. దీనికి తోడు ఆయన సొంత అల్లుడు జనసేనలో చేరారు. దీంతో ఈసారి ఆయనకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది. కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా ఉండి, గతంలో పీఠాపురం ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన వంగా గీత ఈసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా సానుకూలంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. ఆమెకు టికెట్ ఇస్తే దొరబాబుకు టికెట్ లేనట్టే లెక్క. దీంతో గీత చాప కింద నీరులా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉండడంతో కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్, పిఠాపురం జనసేనకు కేటాయిస్తారు అని ప్రచారం జరుగుతోంది. అలా చేస్తే వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2014లో కూడా టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అనంతరం టిడిపిలో చేరారు. ఈసారి కూడా అదే ధీమాతో ఉన్నారు. ప్రతిరోజు జనసేన, టిడిపి మధ్య అధిపత్య పోరు జరుగుతోంది. ఆత్మీయ సమావేశంలోనే కొట్టుకున్నారు కూడా. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా నూతనంగా టీ టైం అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనకు క్యాడర్ కు పొసగడం లేదు. అదే విధంగా ఆయన జనసేన ఇన్చార్జిగా ఉండగా టిడిపి ఇన్చార్జి వర్మతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు జనసేన టికెట్ ఇస్తుందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. అదే జరిగితే పొత్తుల్లో ఉన్న వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు, టిక్కెట్ ఆశిస్తున్న వంగా గీత, ఎస్వీఎస్ఎన్ వర్మ, తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వీరంతా కూడా స్థానికేతరులే. పిఠాపురం ఓటర్లు వరుసగా రెండుసార్లు గెలిపించరు అన్న సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకుని ఈసారి దొరబాబు కు టిక్కెట్ ఇవ్వరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పిఠాపురం కోటకు కాబోయే రాజెవరు ..? పిఠాపురం కోటలో ఏ జెండా ఎగురుతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Read Also..