నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి వచ్చి 13 గేట్ల వరకు స్వాధీనం చేసుకుని, కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అక్కడకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సాగర్ డ్యామ్ ను కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజున డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని ఆయన మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..