ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు. శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో విలేఖరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం విచారణ పూర్తి కాకుండా నిందితులను అరెస్ట్ చేయలేమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కేంద్రం అనుమతించిందని తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పంజాగుట్ట ప్రైవేట్ కేసు వ్యవహారంలో హరీష్ రావుకు క్లీన్ చిట్ వచ్చిందని.. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 6 వేల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్‌ని సస్పెండ్ చేశామని తెలిపారు.
#telangana
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. పలువురి తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో, బయట అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచించారు. సభకు అన్ని విధాలుగా ప్రిపేర్ అయి రావాలని అన్నారు. బయట చిట్చాట్లు మానివేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలోని సమస్యలను చెప్పుకోవడానికి మంత్రులు వారికి సమయం ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలకు స్పందించాలని అన్నారు. ఇక నుంచి తాను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానని ముఖ్యమంత్రి అన్నారు. సభలో ప్రతిపక్షాల ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాలని సూచించారు.
ఇప్పటి సీఎల్పీ సమావేశానికి ఆరుగురు సభ్యులు రాలేదని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా అని అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం మినహాయించవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీకి ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేశారు. తాము ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఇన్నోవేటివ్‌గా ఉంటుందని, విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. సభలో మాట్లాడే సమయంలో విప్ల మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బీఆర్ఎస్ హయాంలో జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలకు కూడా మైక్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయని, కానీ తాము ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇస్తున్నామని అన్నారు. రాజకీయాల్లో మాట్లాడే మాటల వల్ల వ్యక్తిగత డ్యామేజీ ఏమో కానీ, వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు పార్టీ, ప్రభుత్వం లైన్లోనే స్పందించాలని సూచించారు.
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. దీని కోసం రూ.3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.9 వేల కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ట్రిపుల్ ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారన్నారు.
నెట్ ఫ్లిక్స్ కు దేశంలోనే హైదరాబాద్ ది రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు. తమ దృష్టి హాలివుడ్ పైననే అని గతంలోనే చెప్పానని అన్నారు సీఎం. నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, విస్తరణకు.. పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరిచింది. ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి, తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వివరించారు. అయితే, అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకున్నందున, ఇక ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన కోర్టు విచారణ ముగిసినట్లేనని ప్రకటించింది. అదేవిధంగా 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ప్రణాళికలు, పురోగతి, భవిష్యత్ అవసరాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే ఆ రింగ్ రోడ్లను జాతీయ, రాష్ట్ర హైవేలతో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సాధ్యాసాధ్యాలను సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఇక ఆరోగ్య రంగంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల భవనాల పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేలా ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
తెలంగాణలోని సినిమా ప్రియులకు హైకోర్టు తీపికబురు అందించింది. ఇకపై థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే వారు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు వసూలుకు ఆస్కారం కలిగించే జీవో నెంబర్ 121ను హైకోర్టు కొట్టేసింది. సాధారణంగా మనం ఏదైనా మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే వారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అయితే 2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఈ నిబంధన నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.దీంతో అక్కడ సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ప్రత్యేక పార్కింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్లో ఓ ప్రేక్షకుడి నుంచి 20 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. దీనిపై ప్రేమ్ రామావత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ కొంటే పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది. ఈ తీర్పు కేవలం కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పరిమితం కాదని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని తెలిపింది. కోర్టు తాజా ఆదేశాలతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ నిబంధనల పరిధిలోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ పదవిలో మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరించిన జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ కు పంపగా, ఆయన స్థానంలో ఢిల్లీకి తరంజిత్ సింగ్ సంధును నియమించారు. కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌గా బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు.లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కవిందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. సయ్యద్ అతా హస్నైన్ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. నంద్ కిశోర్ యాదవ్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా నియమించారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వచ్చాయి. పరిపాలనా సౌలభ్యం, వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులైన గవర్నర్లు త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని
అసెంబ్లీలో ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ శాసన మండలిని ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. హైదరాబాద్ లోని మండలి ఛాంబర్ లో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ సెంట్రల్ హాల్ నిర్మాణం జరుగుతుందని, దాదాపు 30 కోట్ల వ్యయంతో శాసన మండలి పనులు పూర్తి చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. దాదాపు 99 శాతం పనులు అయిపోయాయని, ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉందని, దాన్ని అలాగే వదిలేస్తే బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకునేలా ఉందన్నారు.
ఆ హెరిటేజ్ బిల్డింగ్‌ను కాపాడుకొని, అసెంబ్లీని సుందరంగా మార్చుకోవాలనే ఆలోచన చేశామని తెలిపారు. ఒకే చోట శాసనసభ, శాసన మండలి ఉండాలనే గొప్ప సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారని, పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసనసభ ఉండబోతుందని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, మంత్రులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ సెషన్స్ తర్వాత సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామని, ఈ పనులు పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని, హెరిటేజ్ భవనం కావడంతో చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ శాసన మండలి భవనానికి ఢోకా లేదన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 8 లోపు నిర్మాణం పూర్తి అయితే అదే రోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తామని గుత్తా తెలిపారు. ఆదర్శ నగర్ లోని 9 ఎకరాల ల్యాండ్ లో కన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆయన వివరించారు. మన రాష్ట్ర శాసన పరిషత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, మిగిలిన రాష్ట్రాలు కూడా మన తరహాలో సభ సమావేశ హాల్స్ నిర్మించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ శాసన మండలిని, జూబ్లీహాల్ ను పునరుద్ధరణ చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకునే ఆలోచనలో సర్కార్ ఉందని గుత్తా తెలిపారు. డ్రైనేజ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, సీఎం ఛాంబర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఛాంబర్, సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రెటరీయేట్, సభ్యులకు మీడియా పాయింట్, మీడియా కోసం మీడియాకు హాల్‌ను నిర్మించినట్లుగా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుత రాజకీయాల్లో ప్రశాంతంగా ఉన్నానని, అవకాశం ఇస్తే శాసన మండలిలో ఉంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్న వాళ్ళు సైలెంట్ అయ్యారని, ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలని, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.. మహిళా రిజర్వేషన్లు వస్తాయి.. రాజకీయంగా చాలా మార్పులు వస్తాయని గుత్తా తెలిపారు. రిజర్వేషన్లు మారతాయని, తమ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటాడని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది చెప్పలేనని, ఖచ్చితంగా పోటీలో అమిత్ ఉంటాడని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోని అనాథ యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సోమవారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కి, అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీలతో మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత, వారికి కేవలం ఆశ్రయం కాదు, భవిష్యత్తు కల్పించడమే లక్ష్యం అన్నారు.
పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని స్వతహాగా ఎదిగేలా తీర్చిదిద్దడం ప్రభుత్వ కర్తవ్యం అని పేర్కొన్నారు. సమగ్ర పునరావాసం, శిక్షణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే మార్గదర్శక నిర్ణయంగా నిలవనుందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లలోపు చిన్నారుల కోసం క్రష్ సెంటర్లు ఏర్పాటు చేసి, అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమం మార్చి నుండి శంషాబాద్‌లో ప్రారంభం కానుంది. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇచ్చి, ప్రైవేట్, అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం. మొదటి విడతలో 20 మంది అనాథ యువతకు శిక్షణ అందించనున్నారు. ఆ తర్వాత బ్యాచ్ ల వారిగా అర్హులందరికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీ హెడ్ కే. అనంతరామన్, ఆపరేషన్స్ హెడ్ ప్రీతి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా హాజరయ్యారు.
పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ బాలికలకు ఇండస్ట్రీ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ శిక్షణ అందించేందుకు ఫిక్కీలేడిస్ అర్గనైజేషన్ తో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందాలు చేసుకుంది. స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్, అవినాష్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ సర్టిఫైడ్ కోర్సులు అనాథ బాలికలకు నేర్పిస్తారు. క్లాస్ రూం టుం కార్పోరేట్ జాబ్ లక్ష్యంగా 30 గంటల శిక్షణా మాడ్యూల్ ద్వారా విద్యార్థులను ఉద్యోగాలు సిద్దం అయ్యేలా తీర్చిదిద్దనున్నారు. మొత్తం 300 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఉద్యోగులు వారికి లభించేలా చేయనున్నారు.
అంగన్వాడీ సేవలను బలోపేతం చేయడానికి అజీమ్ ప్రేమ్ జీ యునివర్సిటీ తో కలిసి 6 నెలల ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు అమలు చేయనున్నారు. ఎర్లి చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. అంగన్వాడీ టీచర్లందరికి ఈ మోడల్ ద్వారా శిక్షణ ఇస్తారు. 30 గంటల ఆన్లైన్ సెషన్లు, 6 రోజుల ప్రత్యక్ష శిక్షణ కలిపి 6 నెలల వ్యవధిలో కోర్సు పూర్తి అవుతుంది. విజయవంతంగా పూర్తి చేసిన వారికి అజీమ్ ప్రేమ్ జీ యునివర్సిటీ సర్టిఫికేషన్ అందిస్తుంది. టీచింగ్, కేరింగ్, పిల్లల బోధనలో సామర్థ్య పెంపు ఈ శిక్షణలో ప్రధానాంశాలు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్ల నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 3 నుండి 6 సంవత్సరాల చిన్నారుల పాఠశాల సంసిద్ధతను మెరుగుపరచడమే లక్షంగా ఈ కోర్సు పనిచేయనుంది




Total views : 38463