రైతులు తలపెట్టిన ‘ఛలో ఢిల్లీ’ మళ్లీ మొదటికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అన్నదాతలు అంగీకారం తెలిపితే మొక్కజొన్న, పత్తి, మూడు రకాల పప్పు దినుసులను ఐదేళ్లపాటు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ మేరకు రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. కేంద్ర మంత్రుల బృందం చేసిన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదన్నారు. రైతులు రేపటి నుంచి తిరిగి నిరసన కొనసాగించనున్నారని, శాంతియుతంగా ఢిల్లీ వైపు మార్చ్‌ను మొదలుపెడతారని చెప్పారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తాము పూర్తిగా పరిశీలించామని, కనీస మద్దతు ధరను కేవలం రెండు మూడు పంటలకు మాత్రమే వర్తింపజేయడం సమంజసం కాదని మరో రైతు సంఘం నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తెలిపారు. ఇతర పంటలు పండించే రైతులకు కేంద్రం చేసిన ప్రతిపాదన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.