ప్రొద్దుటూరు టిడిపి టికెట్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డినే వరించింది. టికెట్ రేసులో నలుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ చివరకి పార్టీ అధిష్టానం నంద్యాల వరద రాజులరెడ్డి వైపే మొగ్గు చూపింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తులో భాగంగా ప్రొద్దుటూరు టిడిపి టికెట్ వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆచి తూచి వ్యహరించారు. ఒక్క ప్రొద్దుటూరు అభ్యర్థిత్వంపై అనేక మార్లు సర్వేలు చేయించుకుని మరీ అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రధానంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న జీవి ప్రవీన్ కుమార్ రెడ్డి, మరో సీనియర్ నేత సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డిలు టికెట్ కోసం వరద రాజులరెడ్డితో సహా పోటీ పడ్డారు. అయితే ప్రొద్దుటూరులో రాజకీయ పరిస్థితులు, పార్టీ నాయకత్వం, ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ధీటైన అభ్యర్థి కోసమే టిడిపి అధిష్టానం ఇంతకాలం ఈ సీటుపై నాన్పుడు ధోరణి అవలంభించింది.
ఏదిఏమైనా చివరకు టికెట్ ఉత్కంఠతకు తెర దించుతూ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో ప్రొద్దుటూరు టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డికే ఖరారు చేసింది. టికెట్ ఖరారు చేయడంతో వరద శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది. వరద కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. టికెట్ ప్రకటించగానే కార్యకర్తులు, అభిమానులు వరదరాజులరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తన అభ్యత్విత్వాన్ని ఖరారు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పెద్దలను కలిశాక భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు. తన టికెట్ రావడానికి కేవలం ప్రజల అభిమానం, మద్దతే కారణమని ఈ సందర్బంగా వరద రాజులరెడ్డి స్పష్టం చేశారు . పార్టీ నిర్వహించిన సర్వేల్లో ప్రజలు, అభిమానులు తన అభ్యత్విత్వాన్ని బలపరచారని వరద రాజులరెడ్డి చెప్పారు. ఈ సందర్బంగా తనను బలపరిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.