ఫోన్ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగు..
తెలంగాణ(Telangana)లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)టీపీసీసీ చీఫ్‌గా, విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనను టార్గెట్‌గా చేసుకుని, ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ప్రత్యేక డివైజ్‌తో ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుసుకున్నట్లు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. ఇందుకోసం రవిపాల్ అనే టెక్ సేవలను కన్సెల్టెంట్ పేరుతో ఎస్‌ఐబీ అధికారులు వినియోగించుకున్నట్లు సమాచారం. మావోయిస్టులపై నిఘా పేరుతో ఇజ్రాయెల్ నుంచి ఓ పరికరాన్ని దిగుమతి చేసుకున్నారు. నిజానికి ఇలాంటి పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. రవిపాల్ సాయంతో.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. ఆ పరికరం 300 మీటర్ల మేర ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్‌లలోకి చొరబడి.. వాటి మైక్రోఫోన్‌ను ఆన్ అయ్యేలా చేస్తుంది. ఆ పరిధిలో వైఫై, ఇంటర్నెట్ డేటాతో కనెక్ట్ అయిన ఎన్ని ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, అలెక్సా వంటి టూల్స్ కూడా ఆ డివైజ్ పరిధిలోకి వస్తాయని సమాచారం. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ప్రణీత్‌రావు, రవిపాల్.. ఆయన కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎన్నికలకు సంబంధించి ఏం చర్చలు జరిగాయి? అనే సంభాషణలను నేరుగా విన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేవారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐబీకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన రవిపాల్‌ను దర్యాప్తు అధికారులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరికరాన్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించి, రేవంత్ ఇంట్లో జరుగుతున్న విషయాలను చేరవేసినందుకు రవిపాల్‌కు కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.
గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు..
గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎస్‌ఐబీ కేంద్రంగా ప్రభాకర్‌రావు అండ్ కో అక్కడి కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన జనతాదళ్(సెక్యులర్)కు అనుకూలంగా.. కాంగ్రెస్ వ్యూహాలను, ఆర్థిక వనరులను తెలుసుకుని, ఆ సమాచారాన్ని జేడీఎస్ ముఖ్యులకు చేరవేసినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలకు నిధులు ఎలా వస్తున్నాయి? వాటిని ఎలా పంపిణీ చేస్తున్నారు? అనే సమాచారం ద్వారా అక్కడి ఎన్నికల అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో పట్టుబడ్డ నగదు మొత్తంలో సింహభాగం కాంగ్రెస్ పార్టీకి చేందినదేనని తెలుస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల సమయంలోనూ.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి కర్ణాటక నేతలు కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో కూడా వారి ఫోన్లు ట్యాప్ అయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
విపక్ష నేతల ఫోన్లతోపాటు.. వ్యాపారుల స్మార్ట్‌ఫోన్లు..
విపక్ష నేతల ఫోన్లతోపాటు.. వ్యాపారుల స్మార్ట్‌ఫోన్లను కూడా ప్రణీత్‌రావు ట్యాపింగ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే.. విపక్ష నేతలకు సహకరించే రియల్‌ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్‌వేర్ సంస్థల అధినేతల ఫోన్ ట్యాపింగ్‌లతో సుమారు 36 మంది దిగ్గజ వ్యాపారులతో ప్రణీత్‌రావు టచ్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారిని బెదిరించి, ట్యాప్ చేసిన వారి ఆడియో/వీడియో క్లిప్‌లతో లొంగదీసుకుని, బీఆర్‌ఎస్ కు పెద్దమొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చేలా చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఎస్‌ఐబీలో హార్డ్‌డిస్క్ లను కటర్‌తో ధ్వంసం..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజు ఎస్‌ఐబీలో హార్డ్‌డిస్క్ లను కటర్‌తో ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు.. వాటి ముక్కలను అనంతగిరి అడవుల్లో పారేసినట్లు వాంగ్మూలమిచ్చాడు. పంజాగుట్ట ఠాణాకు చెందిన ఓ బృందం అనంతగిరి అడవుల్లో వెతికినా.. వాటి జాడ దొరకలేదు. అయితే.. భుజంగరావు, తిరుపతన్నల విచారణలో.. హార్డ్‌డిస్క్ ల ముక్కలను నాగోల్‌లోని మూసీ వంతెన కింద పారేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి, రిట్రీవ్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. హార్డ్‌డి్‌స్కల సెక్టార్లు దెబ్బతిన్నా.. అవి ఎండలో ఎక్స్‌పోజ్ అయినా.. డేటా రికవరీ అసాధ్యమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
కేసు దర్యాప్తులో అధికారులు..
ప్రణీత్‌రావు పలువురు వ్యాపారులను బెదిరించినట్లు ఈ కేసు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసులో ఉన్న అధికారులు గతంలో బ్లాక్‌మెయిల్ చేసినా.. బెదిరింపులకు పాల్పడి ఉన్నా.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఓ మాజీ మంత్రి, ఆయన బంధువులను కూడా ఈ గ్యాంగ్ బెదిరించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలను సేకరించారు.
Follow us on :Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: MLC Kavitha : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి